హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ స్కీమ్ కాదు.. పెద్ద స్కామ్ అని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. నియమ నిబంధనలు, నిర్దిష్ట ప్రణాళిక లేకుండా హడావుడిగా పాలసీని ప్రకటించారని, ప్రభుత్వ భూములను కాజేసేయడమే ఆ స్కీమ్ ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. హిల్ట్ పేరిట కాలుష్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడమేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పర్యావరణవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల తరలింపు పేరుతో 9వేల ఎకరాలకు పైగా భూములను కాంగ్రెస్ పెద్దలు, వారి సన్నిహితులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ తెస్తున్నట్టు కనీసం పరిశ్రమల శాఖ మంత్రికి కూడా తెలియకుండా క్యాబినెట్ అజెండాలో చివరి అంశంగా చేర్చి హడావుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు.
పరిశ్రమలను తరలిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని 22 పారిశ్రామికవాడల్లోని భూములను ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల కోసం వాడుకోబోమని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలను ఖాళీ చేసి ప్రభుత్వ ప్రయోజనాలకు, రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలనే ఆలోచన ఉంటే హెచ్ఎండీఏకు అప్పగించి నిబంధనల ప్రకారం ముందుకెళ్లొచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ కానీ, నిపుణల సూచనలు.. సలహాలు కానీ తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల తరలింపు నిర్ణయం నగరంలో కాలుష్యాన్ని కట్టడి చేయడానికా? రెవెన్యూ జనరేట్ చేసేందుకా? అనే స్పష్టత లేదని విమర్శించారు. పాలసీ జీవో స్వచ్ఛందం అనే పదాన్ని న్యాయపరమైన చిక్కులు లేకుండా కాజేయాలని చూస్తున్నదని ఆరోపించారు. పరిశ్రమల తరలింపు వల్ల సీఎం, ఆయన అనుచరులకే తప్ప ప్రజలకు ఎలాంటి లాభం లేదని చెప్పారు. హైదరాబాద్ భూములను కాజేసి ఉత్తరాది, ఆంధ్రా వ్యాపారులకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని వక్తలు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి భూముల చుట్టే తిరుగుతున్నారని, ఖాళీ స్థలం కనిపిస్తే కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూములను కార్పొరేట్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
నార్త్ కంపెనీలకు అప్పగించే కుట్రలు
ఇప్పుడు వేలాది ఎకరాల పారిశ్రామికవాడల భూములను నార్త్ కంపెనీలకు అప్పగించే కుట్రలు చేస్తున్నారని వక్తలు ఆగ్రహించారు. పరిశ్రమలను మూసేసి, భూములను కాజేసి హైదరాబాద్‌ను ధ్వంసం చేయడమే రేవంత్‌రెడ్డి లక్ష్యమని ఆరోపించారు. ఆ తర్వాత నిర్వీర్యమైన హైదరాబాద్‌ను ఉత్తరాది వ్యాపారులు, కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టేందుకు భారీ కుట్రకు తెరతీశారని ధ్వజమెత్తారు. పరిశ్రమలను తరలిస్తే ఎంఎస్ఎంఈలు పూర్తిగా నిర్వీర్యమవుతాయని, ఎంతోమంది చిన్న తరహా పరిశ్రమల యజమానులు రోడ్డున పడతారని పేర్కొన్నారు. కుట్ర రాజకీయాలతో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితులకు భూములను కట్టబెట్టి కేంద్రానికి లబ్ధి చేకూర్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఆర్థిక నిపుణుడు పాపారావు, బీఆర్ఎస్ నేత కిషన్‌రెడ్డి, టీ న్యూస్ సీఈవో శైలేష్‌రెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి, పర్యావరణవేత్త సాయిభాస్కర్రెడ్డి, ఎంఎస్ఎంసీ జేఏసీ చైర్మన్ కోటేశ్వర్రావు, కో కన్వీనర్ మర్రి ప్రభాకర్, సీనియర్ జర్నలిస్టులు నర్రా విజయ్‌కుమార్, రమణకుమార్, ఓయూ స్కాలర్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.