హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు నైపుణ్యశిక్షణ, ప్లేస్‌మెంట్స్ కల్పించడంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చొరవ తీసుకుంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో నైపుణ్యశిక్షణ కోసం ‘ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్’ (నాస్కామ్)తో ఎంవోయూ కుదుర్చుకున్నది. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, నాస్కామ్ ఐటీ, ఐటీఎస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈవో అభిలాష గౌర్ ఎంవోయూ కుదుర్చుకున్నారు.
నాస్కామ్ ద్వారా 400 రకాల ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మొదటి దశలో 10 రకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. నాస్కామ్‌లో సభ్యులైన కంపెనీలు నేరుగా శిక్షణ తీసుకున్న, సర్టిఫికెట్ పొందిన విద్యార్థుల సమాచారాన్ని గ్రహిస్తాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించి, నైపుణ్యాలు పరీక్షించి అర్హతలున్న వారిని రిక్రూట్ చేసుకుంటాయి.