Group 1 Aspirants | చిక్కడపల్లి, అక్టోబర్17: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు పోలీసుల నిర్బంధాన్ని సైతం లెక్కచేయ డం లేదు. రెండోరోజైన గురువారం కూడా నిరసనను కొనసాగించారు. అర్ధరాత్రి దాక అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వా యిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు హైదరాబాద్ అశోక్‌నగర్ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గురువారం కూడా గాంధీనగర్ కెనరాబ్యాంక్ సమీపంలో ఉన్నపార్కులో వందలాది మంది గ్రూప్స్ అభ్యర్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈక్రమంలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ముషీరాబాద్ పోలీసులు దాదాపు 15 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అశోక్‌నగర్‌లో పోలీసుల నిర్బంధకాండ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్స్ అభ్యర్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాలతో పోలీసులు అశోక్‌నగర్‌లో నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు.అభ్యర్థుల వినతి మేరకు వారిని కలువడానికి వస్తానని గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అశోక్‌నగర్ చౌరస్తా సహా ఇతర ప్రాంతాల్లో నిర్బంధ వాతావరణం కనిపించింది. నలుగరు గుమిగూడితే చాలు వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో అభ్యర్థులతోపాటు స్థానికులు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు.