Congress Govt | హైదరాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ): ఇసుక బంగారమైపోయింది. నూతన విధానం పేరుతో ప్రభుత్వ చర్యలు బెడిసికొడుతున్నాయి. రూ.1200 నుంచి 1400 మధ్య ఉండాల్సిన ఇసుక టన్ను ధర నెలరోజులుగా రూ.2000కుపైగా పలుకుతున్నది. రీచ్‌ల వద్ద లోడింగ్ కోసం రెండు రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇసుకను ఇంటికి సరఫరా చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైనా చిరునామాపై మాత్రమే ఇసుక బుకింగ్ చేయాలని, అడ్డాలపై ఇసుకను విక్రయించే వీలులేదని అధికారులు నిబంధన విధించడంతో బహిరంగ మార్కెట్లో ఇసుక లభ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఇసుక లారీలు బుకింగ్ చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది.
రాత్రి 9 గంటల వరకు ఇసుక లోడింగ్‌కు అనుమతిచ్చినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం లోడింగ్ చేయడంలేదని రవాణాదారులు తెలిపారు. ఇసుక లోడింగ్‌కే రెండు రోజుల సమయం పడుతున్నదని, ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని చెప్పారు. ఓవర్ లోడింగ్‌ను అదుపుచేసినప్పటికీ డిమాండ్‌కు తగ్గట్టుగా ఇసుకను అందుబాటులో ఉంచితే ధరలు అదుపులో ఉంటాయని, అలాకాకుండా ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతం పెంచేశారని విమర్శిస్తున్నారు. ఇసుక రీచ్‌ల నుంచి రోజుకు సగటున 60వేల మెట్రిక్ టన్నుల ఇసుక రవాణా జరగాల్సివుండగా, ఇప్పుడు సగానికి పడిపోయిందని వెల్లడించారు. అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదని పేర్కొన్నారు. పర్యవేక్షణ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించడంతో ఇసుక రవాణాలో మరింత జాప్యం చోటుచేసుకుంటున్నదని వివరించారు.
అక్రమాలను అదుపుచేయడం మంచిదే అయినప్పటికీ వినియోగదారులు పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి టీజీఎండీసీ ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మార్కెట్లో ఇసుక సరఫరాను పెంచడం ద్వారా ధరలు తగ్గించే ఆస్కారముందని ఇండ్ల నిర్మాణదారులు అభిప్రాయపడ్డారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా ఉంటే ధరలు నిలకడగా ఉంటాయని, సరఫరా తగ్గినందునే ధరలు పెరిగాయని చెప్పారు. ఇసుక ధర నెలరోజుల నుంచి టన్నుకు రూ.2000పైగా పలుకుతున్నదని వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో దొడ్డు ఇసుక ధర రూ.2000, ఫైన్ శాండ్ రూ.2100కుపైగా పలుకుతున్నదని తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ ఇసుకను మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకు టీజీఎండీసీ చర్యలు చేపట్టాలని నిర్మాణదారులు కోరుతున్నారు.