హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల కల్పన, అధిక వడ్డీల పేరిట తెలంగాణ, ఏపీలో 2,000 మందిని మోసగించి.. దాదాపు రూ.140 కోట్లు వసూలు చేసిన మోసగాళ్లయిన తండ్రీకొడుకులను తెలంగాణ సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ‘ముద్ర అగ్రికల్చర్ సిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ’ పేరుతో అక్రమంగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేయించిన సంస్థ చైర్మన్ తిప్పనేని రామదాసప్పనాయుడును అమరావతిలో, అతని కొడుకు సాయికిరణ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. రిమాండ్ విధించినట్టు సీఐడీ డీజీ చారుసిన్హా ఓ ప్రకటనలో తెలిపారు.
మోసం జరిగిందిలా!
నాలుగేండ్ల క్రితం ఓ సొసైటీని ఏర్పాటు చేసిన రామదాసప్ప.. కేంద్ర ప్రభుత్వ పథకమైన ముద్ర యోజనతో పోలి ఉండేలా లోగో తయారు చేయించాడు. తెలంగాణ, ఏపీ నుంచి 1,600 మందితో డబ్బులు కట్టించుకుని, వారిని మారెటింగ్ మేనేజర్లుగా చేర్చుకున్నాడు. ఇలా రెండు రాష్ర్టాల్లో 330 శాఖలు ఏర్పాటు చేసి, ఉద్యోగులు, రైతుల నుంచి రూ.140 కోట్లను సేకరించాడు. కాగా అధికారులు కేసును సీఐడీకి బదిలీ చేశారు