TGS RTC | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులపై ఆర్టీసీ పెనుభారం మోపుతున్నది. రద్దీని ఆసరాగా చేసుకొని స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలను వసూలు చేస్తున్నది. పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులంటూ అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచుతుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
బతుకమ్మ, దసరా సందర్భంగా వారంపాటు ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసిన విషయం తెలిసిందే. దీపావళికీ అదే సీన్ రిపీట్ అయ్యింది. పండుగ ముగిసినా స్పెషల్ చార్జీలు వసూలు చేయడం గమనార్హం. ఆదివారం కరీంనగర్ -2 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా అధిక చార్జీ వసూలు చేయడంపై ప్రయాణికులు తిరగబడ్డారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్(జేబీఎస్)కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడు టికెట్ ధర చూసి కంగుతిన్నాడు. సాధారణంగా జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు సూపర్‌లగ్జరీ బస్సులో రూ.330 చార్జీగా ఉంది. కానీ ఆదివారం కరీంనగర్ డిపో బస్సు ఎక్కిన ప్రయాణికుల నుంచి రూ.470 వసూలు చేశారు. ఇదేమిటని ప్రయాణికులు బస్సు డ్రైవర్‌ను నిలదీయగా రద్దీ ఎక్కువగా ఉండటంతో స్పెషల్ బస్సులు నడుపుతున్నామని, టికెట్ మిషన్‌లో రూ.470 ఫిక్స్ చేశారని సమాధానం చెప్పాడు. దీంతో టికెట్ రేట్ల తేడాలను చూపుతూ కొందరు ప్రయాణికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆర్టీసీ స్పెషల్ చార్జీల వసూలుపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. ఇదే విషయమై ఆర్టీసీ యాజమాన్యాన్ని వివరణ కోరగా.. బస్సు టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నది. రెగ్యులర్ సర్వీసులకు సాధారణ చార్జీలే అమల్లో ఉన్నట్టు తెలిపింది. 2003లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం పండుగ, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో రూ.150వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటు సంస్థకు ఇచ్చిందని పేర్కొన్నది. అందులో భాగంగానే స్పెషల్ బస్సులో చార్జీ వసూలు చేసినట్టు స్పష్టం చేసింది.