హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మాయ మాటలతో గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రిజర్వేషన్లపై ఢిల్లీలో కొట్లాడాల్సిన ముఖ్యమంత్రి గల్లీలో డ్రామా క్రియేట్ చేశారే తప్ప రిజర్వేషన్ల కోసం ఏనాడూ చిత్తశుద్ధిగా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలపై తమకు ప్రేమ ఉన్నట్టు తూతూమంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. 42 శాతం రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కొట్లాడాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో చట్టం చేయించి షెడ్యూల్ 9లో చేర్చాలని కోరారు. అఖిలపక్ష పార్టీలను భాగస్వామ్యం చేసి ఢిల్లీ వేదికగా యుద్ధభేరి మోగించాలని, ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుందని హరీశ్‌రావు తెలిపారు.