రోహిన్‌రెడ్డి పర్సనల్ ఆఫీసులో 2 గంటలపాటు ఎవరి వాటా ఎంత అనేదానిపై వాడివేడిగా చర్చ జరిగినట్టు సమాచారం. సార్‌కు ఎంతిస్తున్నారో.. మేడమ్కూ అంతే ఇవ్వాలని సుమంత్ తెగేసి చెప్పినట్టు తెలిసింది. మాట మార్చొద్దంటూ డైరెక్టర్ చెప్పడంతో సహనం కోల్పోయిన సుమంత్.. రోహిన్‌రెడ్డి టేబుల్ మీదున్న గన్ తీసి గురిపెట్టినట్టు సమాచారం!
హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఓఎస్డీ సుమంత్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడానికి ప్రయత్నించడం, మంత్రి ఇంట్లోనే అతన్ని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు సాహసించటం, తమ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారంటూ కొండా సురేఖ కూతురు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం, ఈ పంచాయితీ పార్టీ పెద్దల వరకు వెళ్లడం.. ఇలా బుధ, గురువారాల్లో జరిగిన పరిణామాలు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దక్కన్ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ తలకు సుమంత్ తుపాకిగురి పెట్టాడనేది ప్రధాన ఆరోపణ. అయితే.. ఈ సంఘటన వెనుకున్న వాస్తవాలపై నమస్తే తెలంగాణ లోతుగా పరిశోధించగా కండ్లు బైర్లుకమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రూ.వందల కోట్ల లావాదేవీల్లో వాటాల కోసం జరిగిన ఈ కొట్లాటలో ముఖ్యనేతతోపాటు కొందరు మంత్రులు, వారి ముఖ్య అనుచరుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. ముఖ్యనేత నీడగా గుర్తింపు పొందిన రోహిన్ రెడ్డి, ముఖ్యనేత ఇంటి వెనకాలే ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో ఈ నెల 11 రాత్రి జరిగిన సెటిల్మెంట్ పంచాయితీ ఏమిటి? కొండా సురేఖ ఓఎస్డీ ఎందుకు వచ్చారు? దక్కన్ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ తలకు గన్ ఎందుకు గురిపెట్టాల్సి వచ్చింది? గుట్టుచప్పుడు కాకుండా జరగాల్సిన వాటాల పంపకం రోడ్లమీదికి ఎట్లా వచ్చింది? ఈ తతంగం వెనుక ముఖ్యనేతకు సంబంధం ఏమిటి? వంటి వివరాలతో కథనం.
హుజూర్‌నగర్‌లో దకన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ ఉన్నది. ఈ కంపెనీ గుర్రంబోడు గ్రామంలోని సర్వే నెంబర్ 540లో 43 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు సైదుల్ నామా ఫారెస్ట్ ఏరియా కంపార్ట్మెంట్ జోన్ 26, 27లో దక్కన్ సిమెంట్స్ సున్నపురాయి తవ్వకాలు జరిపి, ఆ తర్వాత ఏర్పడిన భారీ గొయ్యిలను పూడ్చకుండానే కొత్త కంపార్ట్మెంట్లలో తవ్వకాలు జరుపుతున్నదని ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఈ అక్రమాలను గుర్తించి, కంపెనీ వ్యవహారాలపై సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ రిపోర్ట్‌ను కంపెనీ డైరెక్టర్ల ముందు పెట్టి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రి కొండా సురేఖతో కంపెనీకి చెందిన యాక్టివ్ వర్కింగ్ డైరెక్టర్‌తో మాట్లాడించినట్టు సమాచారం. అయితే ముఖ్యనేతకు, స్థానిక మంత్రికి, ఉమ్మడి జిల్లా మంత్రికి.. ఇలా ఎవరి వాటా వాళ్లకు ఇస్తున్నామని, మీరు అడిగినా అడగకపోయినా కోటా ప్రకారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి కూడా ఇస్తున్నామని కంపెనీ యాజమాన్యం తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ కంపెనీ డైరెక్టర్ ప్రతిపాదిత వాటాకు సుమంత్ అంగీకరించలేదని, అడినంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడని సమాచారం. ఇలా ఇస్తే ఆదాయంలో 30 శాతం సొమ్ము అగ్రస్థాయి నేతలకే ఇవ్వాల్సి వస్తుందని, ఇలాగైతే తాము కంపెనీని నడపలేమని ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు తెలిసింది.
ఓఎస్డీ సుమంత్ ఇదే విషయాన్ని మంత్రి కొండా సురేఖకు వివరించారని, యాజమాన్యాన్ని తమ దగ్గరికి రప్పించాలంటే కంపెనీ అక్రమాలపై అధికారిక ఆధారాలు సేకరించాలని సూచించినట్టు తెలిసింది. దీంతో అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను రంగంలోకి దింపినట్టు చెప్తున్నారు. కంపెనీకి కేటాయించిన భూములు, కంపెనీ ఆక్రమించిన భూములపై అటవీ శాఖ అధికారులు సర్వే చేయగా, దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ 42 ఎకరాల రిజర్వ్ ఫారెస్టు భూములను ఆక్రమించిందని నిర్ధారించినట్టు తెలిసింది. దీంతోపాటు సున్నం రాయి కోసం తవ్విన పాత గొయ్యిలను పూడ్చలేదని, పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ క్లియరెన్స్‌లు లేకుండానే కొత్త గొయ్యిలను తవ్వుతున్నారని తేలినట్టు సమాచారం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నడిపిస్తున్నట్టు పీసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఇన్ని అక్రమాల నేపథ్యంలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి రూ.300 కోట్ల జరిమానా విధిస్తూ రాష్ట్ర పర్యావరణ శాఖ నుంచి నోటీసులు పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నోటీసులతో బిత్తరపోయిన కంపెనీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించటంతోపాటు, స్థానిక మంత్రికి మొరపెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తన్నాయి. దీంతో ఆ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి.. కంపెనీలపై రూ.వందల కోట్ల జరిమానాలు వేసుకుంటూ పోతే రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు మిగలవని, ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. కంపెనీ యాజమాన్యం వచ్చి మీతో మాట్లాడుతారని కూడా చెప్పినట్టు సమాచారం. దీంతో బంతి తన కోర్టులోకి వచ్చిందని నిర్ధారించుకున్న ఓఎస్డీ సుమంత్.. కంపెనీ యాజమాన్యంతో బేరసారాలు చేసినట్టు చెప్పుకుంటున్నారు. పర్యావరణ అనుమతులు ఇప్పించటంతోపాటు, కబ్జాపెట్టిన భూమిలో మైనింగ్ చేసుకునేందుకు అనుమతులు ఇప్పిస్తామని చెప్పి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుమంత్‌కు డబ్బులు ముట్టిన తర్వాత పర్యావరణ అనుమతుల ప్రక్రియ వేగవంతం అయ్యిందని, కంపెనీ కార్యకలాపాలు కూడా సజావుగానే సాగాయని సమాచారం. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఫైల్ అటవీ శాఖ నుంచి సీఎంవోకు వెళ్లినట్టు తెలిసింది. అక్కడ ఫైల్‌పై అభ్యంతరాలు తెలుపుతూ నెలల తరబడి పక్కకు పెట్టారన్న చర్చ జరుగుతున్నది. పని కాకపోవటంతో కంపెనీ ప్రతినిధులు అనుమానం వచ్చి విషయాన్ని డైరెక్టర్ల దృష్టికి తీసుకుపోయినట్టు తెలిసింది. వారు వాస్తవ పరిస్థితిపై ఆరా తీయగా.. ఓఎస్డీ సుమంత్ ముఖ్యనేత వాటాను ఆయనకు అప్పజెప్పలేదని గుర్తించారట. దీంతో కంపెనీ యాజమాన్యం సుమంత్ వెంట పడ్డారని, హామీ ప్రకారం సీఎంవో నుంచి అనుమతులు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అదే సమయంలో స్థానిక మంత్రికి సైతం ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఆయన ముఖ్యనేతకు ఫోన్ చేసి సుమంత్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. అప్పటికే దక్కన్ సిమెంట్స్ ఫైల్‌పై గుర్రుగా ఉన్న ముఖ్యనేత, తనకు ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలని మంత్రికి సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు ఆయన సుమంత్ మీద ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ ఫిర్యాదు చేసిన విషయాన్ని సుమంత్ పసిగట్టి మంత్రి కొండా సురేఖకు వివరించినట్టు సమాచారం. స్థానిక మంత్రి తీరుపై ఆమె మహేశ్‌కుమార్ గౌడ్‌కు వివరించారని తెలిసింది. ఆయన ఈ విషయాన్ని ముఖ్యనేతకు చేరవేసినట్టు సమాచారం. దీంతో ఈ అంశాన్ని తన షాడో రోహిన్‌రెడ్డితో మాట్లాడుకోవాలని ముఖ్యనేత సూచించినట్టు తెలిసింది.
ముఖ్యనేత ఆదేశాలతో ఈ నెల 11న సాయంత్రం ముఖ్యనేత ఇంటి వెనుకే ఉన్న రోహిన్‌రెడ్డి కార్యాలయంలో సమావేశం జరిగినట్టు తెలిసింది. దక్కన్ సిమెంట్స్ తరఫున కంపెనీ డెరెక్టర్, ముఖ్యనేత తరఫున ఆయన షాడో రోహిన్‌రెడ్డి, కొండా దంపతుల ప్రతినిధిగా సుమంత్ హాజరు అయినట్టు తెలిసింది. ముఖ్యనేత టేబుల్ మీద ఉన్న కంపెనీ దరఖాస్తు ఫైల్‌ను రోహిన్‌రెడ్డి పట్టుకొని వచ్చినట్టు తెలిసింది. ఎవరి వాట ఎంత అనే దాని మీదనే దాదాపు రెండు గంటల పాటు వాడివేడి చర్చలు జరిగినట్టు తెలిసింది. సార్‌కు ఎంత వాటా ఇస్తున్నారో.. మా మేడమ్‌కు కూడా అంతే వాటా ఇవ్వాలని సుమంత్ తెగేసి చెప్పినట్టు తెలిసింది. ఈ డిమాండ్‌కు రోహిన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘మీకు అన్ని శాఖల నుంచి ఆదాయం వస్తుంది. మాకు మా శాఖ తప్ప వేరే ఏముంది’ అంటూ సుమంత్ ఘాటుగా బదులిచ్చినట్టు తెలిసింది. మధ్యలో కంపెనీ డైరెక్టర్ కల్పించుకొని ‘సవ్యంగా సాగుతున్న కంపెనీ వ్యవహారాలను రోడ్డు మీదికి తెచ్చావు. ఉద్దేశపూర్వకంగానే రూ.300 కోట్ల జరిమానా వేయించావు’ అంటూ సుమంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని అనుమతులు తెస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఇప్పుడు మాట మార్చటం ఏమిటని నిలదీసినట్టు తెలిసింది. ఆయన వ్యాఖ్యలతో కోపోద్రిక్తుడైన సుమంత్.. రోహిన్‌రెడ్డి టేబుల్ మీద ఉన్న గన్ తీసి సదరు డైరెక్టర్‌కు గురిపెట్టినట్టు సమాచారం. దీంతో ఆందోళన చెందిన రోహిన్‌రెడ్డి తుపాకీ లాక్కొని, సుమంత్‌కు సర్దిచెప్పి బయటికి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రోహిన్‌రెడ్డి సదరు కంపెనీ డైరెక్టర్‌ను ముఖ్యనేత వద్దకు తీసుకెళ్లి, జరిగిన విషయం వివరించినట్టు సమాచారం. సుమంత్ తీరుపై ముఖ్యనేత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి, వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించాలని ఆదేశించినట్టు తెలిసింది. దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో సుమంత్‌ను మంత్రి ఓఎస్డీ బాధ్యతల నుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభ్వుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఉత్వర్వులు జారీ చేసింది. మరోవైపు స్థానిక మంత్రి గతంలో ఇచ్చిన ఫిర్యాదు కాపీని పోలీసు ఉన్నతాధికారికి పంపి, సుమంత్‌పై కేసులు నమోదు చేయాలని సూచించినట్టు తెలిసింది. ముఖ్యనేత ఆదేశాలతో పోలీసులు ఫిర్యాదు కాపీని ఆధారంగా చేసుకొని సుమంత్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ముఖ్యనేత స్వయంగా సిఫారసు చేసిన కేసు కావడంతో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాత్రికి రాత్రే అతని అరెస్టు చేసేందుకు నానా హంగామా చేశారని, ఏకంగా మంత్రి ఇంట్లోకి వెళ్లటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయాంశంగా మారింది.