Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావాను నిబంధనలకు అనుగుణంగా కాగ్నిజెన్స్ తీసుకోవాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం తిరిగి విచారణ చేసి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కింది కోర్టుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కాగ్నిజెన్స్ తీసుకోవడాన్ని రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ ఉత్తర్వులు జారీచేశారు. డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై 2014లో రేవంత్ చేసిన విమర్శల వల్ల తమ పరువుకు భంగం వాటిల్లిందని రామేశ్వర్రావు హైదరాబాద్ మేజిస్ట్రేట్ కోర్టు లో రూ.90 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు వేశారు. ఈ ఫిర్యాదును కింది కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకుని నోటీసులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని 2018లో రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కింది కోర్టు విచారణను నిలిపివేస్తూ గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఆ వ్యాజ్యం శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. రేవంత్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ కాగ్నిజెన్స్‌లోకి తీసుకోడానికి నిర్ధిష్టమైన కారణాలు చెప్పాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని గుర్తుచేశారు. లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయకుండానే మేజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకోవడం చెల్లదని వాదించారు. ఈ వాదనలను రామేశ్వర్రావు తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. కింది కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవడం చట్టబద్ధమేనని వాదించారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారావు వాదిస్తూ, తాజాగా తిరిగి విచారణ చేపట్టేలా ఉత్తర్వులు ఇస్తే అభ్యంతరం లేదని తెలిపారు. కాగ్నిజెన్స్ నిర్ణయాన్ని దిగువ కోర్టుకు రిమాండ్ చేయాలని కోరారు. కాగ్నిజెన్స్ కారణాలు వెల్లడించేలా కింది కోర్టుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తగిన కారణాలు పేరొంటూ కాగ్నిజెన్స్ తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు ఉండాలని స్పష్టం చేసింది. అందుకే కాగ్నిజెన్స్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మళ్లీ ప్రొసీడింగ్స్ నిర్వహించేందుకు కేసును కింది కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.