హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ): గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కార్లో గుబులు పుట్టిస్తున్నది. ఆ పార్టీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. గ్రూప్-1లో జరిగిన తప్పిదాలతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తప్పదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఇదే గ్రూప్-1పై తీవ్ర విమర్శలు, పోరాటాలు చేసి.. ఇ ప్పుడు ఘోరమైన తప్పులు బయటపడటం తో ఏ ముఖం పెట్టుకొని నిరుద్యోగుల ముం దుకు వెళ్తామంటూ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిరుద్యోగులు నిలదీస్తే, ఏం సమాధానం చెప్పాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ డ్యామేజ్ను కంట్రో ల్ చేసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నా రు.
టీజీపీఎస్సీ తీరుపై, పరీక్ష నిర్వహణ విధానంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నా రు. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు పార్టీకి దూరమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చాక నిలుపుకోలేకపోతున్నామని, వారికి కనీస న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. రెండేండ్లు కావొస్తున్నా ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించనేలేదు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకే నియామకపత్రాలిచ్చింది. ఆ ఉద్యోగాలు తామే ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నది. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఉత్తమాటగానే మిగిలిపోయింది.
బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో జరిగిన చిన్న చిన్న తప్పులపై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రచ్చ రచ్చ చేసింది. నిరుద్యోగులను తన రాజకీయ క్రీడ లో పావుగా ఉపయోగించుకున్నదనే విమర్శలొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని సీఎం, మంత్రులు పలుమార్లు ప్రకటించారు. ప్రక్షాళన చేస్తే గ్రూప్-1లో మళ్లీ తప్పు లు ఎందుకు జరిగాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదేనా? కాంగ్రెస్ చేసిన ప్రక్షాళన అంటూ నిరుద్యోగ అభ్యర్థులు సర్కార్ను ప్రశ్నిస్తున్నారు.
నిరుద్యోగులను తలుచుకుంటేనే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు ఉన్నది. క్షేత్రస్థాయిలోకి ఏ విధంగా వెళ్లగలమని, నిరుద్యోగులను ఏ విధంగా ఎదుర్కోగలమనే ఆందోళ న వారిలో నెలకొన్నది. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులకు గ్రూప్-1 అంశం మరింత ఆగ్రహాన్ని తెప్పించిందని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ గ్రూప్-1 వివాదం పార్టీకి తీవ్ర ప్రతిబంధకంగా మారిందని జంకుతున్నారు.