High Court | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు అప్పట్లోనే ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్ 24న దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేయగా, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. ఆయా వ్యాజ్యాలపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌ను శాసనసభ స్పీకర్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తుంటే.. ఆ వ్యవహారంపై హైకోర్టు/సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయొచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదించారు. ఇటీవల కేశమ్ మెఘాచంద్ కేసులో పదో షెడ్యూల్ లక్ష్యం దెబ్బతినకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. రాజేంద్రసింగ్ రాణా, కిహోటా హోలా కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం స్పీకర్‌కు హైకోర్టు/సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయొచ్చని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్‌కు ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్చిలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే ఫలితం లేకపోయిందని, మూడు నెలల గరిష్ఠ గడువు ముగిసినందున మరో నాలుగు వారాలు స్పీకర్ సమయం తీసుకునేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయొచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు.
నిర్దిష్ట గడువులోగా స్పీకర్ తమ ముందున్న పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకోవాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలుచేయాలని కోరారు. మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణం కింద స్పీకర్‌కు నోటీసులు జారీ చేసిందని వివరించారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో పిటిషన్లను విచారణ చేస్తారని చెప్పారు. ట్రిబ్యునల్ చైర్మన్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చునని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోతుందని వివరించారు. న్యాయ శాఖ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌కు కోర్టులు నోటీసులు జారీ చేయడానికి వీల్లేదని, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక దానిపై న్యాయ సమీక్షకు వీలున్నదని వాదించారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డ్డి, జంధ్యాల రవిశంకర్ వాదించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు వెలువరించనున్న తీర్పుపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొన్నది.