హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు, జలవనరుల సంరక్షణ పేరిట పేదల ఇండ్లు కూల్చుతున్న హైడ్రాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గతంలోనే పలు కేసులలో హైడ్రా చర్యలను తప్పుబట్టిన హైకోర్టు.. మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లోని సర్వేనంబర్ 66, 67లో దాదాపు 2000 చదరపు గజాల భూమి విషయంలో హైడ్రా చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. పార్కు స్థలం ఆక్రమణ జరిగిందంటూ హైడ్రా చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టింది. మాదాపూర్‌లోని తమ స్థలంలో నిర్మించుకున్న ఇండ్ల విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకున్నాయంటూ వై జగాల్‌రెడ్డి, వై వెంకట్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై మంగళవారం జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి విచారణ జరిపారు. విచారణ సందర్భంగా.. తమ స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది చెప్పారు. జనవరి 28న హైడ్రా జారీ చేసిన నోటీసులకు పిటిషనర్.. ఫిబ్రవరి 3న జవాబు చెప్పారని వివరించారు. అర్బన్ ల్యాండ్ (సీలింగ్ అండ్ రెగ్యులేషన్ ) చట్టం-1976 కింద క్రమబద్ధీకరణ కూడా జరిగిందని వివరించారు. అది పారు భూమి అని జూబ్లీ ఎన్క్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపిస్తున్నదని, తమ గోడు పట్టించుకోకుండా హైడ్రా ఏకపక్షంగా చర్యలు తీసుకున్నదని పిటినర్ల తరపు లాయర్లు చెప్పారు.
హైడ్రా తరపు న్యాయవాది స్పందిస్తూ, జూబ్లీ ఎన్క్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భూమిని పారు కోసం కేటాయించినట్టు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల విన్న తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్లే సదరు స్థల యజమానులని, ఆ స్థలం పారు పరిధిలో లేదని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. కోర్టు మునుపటి రికార్డులు, ప్రభుత్వ పత్రాలను పరిశీలిస్తే పిటిషనర్ వాదనకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.
పిటిషనర్ పేరొన్న భూమిని పారుగా వర్గీకరించలేదని స్పష్టంచేశారు. తక్షణమే ఆ స్థలంలో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును తొలగించాలని ఆదేశించారు. ఆ స్థలం విషయంలో హైడ్రా, ఇతర అధికారులు జోక్యం చేసుకోకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ల భూమి విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. హైడ్రా స్వాధీనం చేసుకున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని పేర్కొన్నారు. తదుపరి విచారణ సెప్టెంబర్ నెల 18కి వాయిదా వేసింది.
హైడ్రా కూల్చివేతలు చేపట్టిన భూమి 2004 సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని, అప్పట్లో కొంతమంది పెద్దలు తమ అధికార బలంతో సీలింగ్ భూమిలో అక్రమంగా లే అవుట్ వేశారు. దీనిని అప్పటి హుడా 2006లో సీలింగ్ భూమిలో లేఅవుట్ ఇవ్వడం కుదరదని తిరస్కరించింది. ప్రభుత్వం 2008లో జైహింద్‌రెడ్డి కుటుంబ సభ్యులకు క్రమబద్దీకరణ చేస్తూ జీవో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2012లో పార్క్‌ను రద్దు చేసింది. క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేయాలని కొంత మంది హైకోర్టుకు వెళ్లగా… 2015లో క్రమబద్ధీకరణ జీవో సరైనదేనని తుది తీర్పు ఇచ్చింది. 2013లో జూబ్లీ ఎన్క్లేవ్ లేఅవుట్ రద్దు చేస్తూ మరో ఆదేశం కూడా కోర్టు ఇస్తూ సర్ప్లస్ ల్యాండ్‌లో లేఅవుట్ ఎలా వేస్తారని ప్రశ్నించింది.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జీవోలు అమలులోకి వచ్చాయి. దీనిపై విజిలెన్స్ కమిటీ కూడా విచారణ చేసి, ఈ భూమి జగాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డికే చెందుతుందని 2017లో విజిలెన్స్ రిపోర్టు రాశారు. తాజాగా హైడ్రా వచ్చి, ఇది పార్క్ స్థలం అంటూ కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా కూల్చివేతలపై సీరియస్ అయిన హైకోర్టు.. వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని స్పష్టంచేసింది. ఇది పార్క్ స్థలం అని నిర్ధారించలేమని తేల్చిచెప్పింది. ఏ ఒక్కరు కూడా ఆ స్థలంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టంచేసింది. ఈ తీర్పు హైడ్రాకు చెంపపెట్టు లాంటిదని, హైడ్రా అనవసర వివాదాలు సృష్టిస్తున్నదని పిటిషనర్లు అభిప్రాయం వ్యక్తంచేశారు.