హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు పిటిషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట లభించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్న భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై గతంలో సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌ను భూపాలపల్లిలోని మేజిస్ట్రేట్ కోర్టు కొట్టేసింది. దీంతో ఆ తీర్పుపై సమీక్ష జరపాలంటూ ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.
దానిపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి.. ఈ ఏడాది జూలై 10న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్ సంయుక్తంగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ కే లక్ష్మణ్ స్పం దిస్తూ.. జిల్లా జడ్జి ఉత్తర్వులను తప్పుబట్టారు. మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై జిల్లా జడ్జి విచారణ చేపట్టడం సరికాదని, అందుకే ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నానని ప్రకటించారు. కౌంటర్ దాఖలు నిమిత్తం ఫిర్యాదుదారుకు నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నాన్ డిటెన్షన్ విధానాన్ని రద్దుచేసినట్టుగానే సంఖ్యతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను నియమించాలని ఎస్జీటీ ఫోరం కోరింది. విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ఫోరం అధ్యక్షుడు అనిల్‌కుమార్, మాజీ అధ్యక్షుడు ఎండీ కమ్రోద్దీన్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.