High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ‘పత్రాలను పరిశీలించి భూయాజమాన్య హకులను నిర్ణయించడానికి మీరెవరు? హకులను తేల్చే అధికారం మీకెకడిది? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏమిటో మీకు తెలుసా? రాత్రికి రాత్రి ఏదో చేసేద్దామని కలలు కంటున్నారా? రాత్రికి రాత్రే హైదరాబాద్ నగరాన్ని మార్చేస్తారా? సెలవు రోజుల్లో కూల్చివేతలు ఏమిటి? మీకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోరా? ఎన్నిసార్లు చెప్పినా మారరా? ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం..’ అంటూ హైకోర్టు హైడ్రాను తీవ్రస్థాయిలో మందలించింది. ‘జలవనరులు, రోడ్లు, ప్రభుత్వ భూముల రక్షణకు కోర్టులు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అయితే, అందుకు తీసుకునే చర్యలు చట్టబద్ధంగా ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు. అక్రమ నిర్మాణాలైనప్పటికీ కూల్చివేత చర్యలు చట్టప్రకారం ఉండితీరాల్సిందే. ఏం చర్యలు తీసుకున్నప్పటికీ అవి చట్టానికి లోబడి లేకపోతే ఎలా?’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రికి రాత్రే నగరాన్ని మార్చలేరని పేర్కొంది. సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలు చేపడితే ఇక హైడ్రా అంటే భరోసా ఎలా కలుగుతుందని నిలదీసింది.
హైడ్రా చర్యలు భరోసాకు బదులు భయాందోళనకు గురి చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99ను చదివారా? ఆ జీవోలోని నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలని తెలియదా అని వ్యాఖ్యానించింది. నిబంధనల పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేయడం సబబు కాదని హితవు చెప్పింది. కేవలం పత్రాలను చూసి హకులను ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది. హకులు నిర్ణయించే అధికారం హైడ్రా అధికారులకు ఎకడ ఉందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వడానికి తగిన గడువు ఇచ్చి చట్టప్రకారం కూల్చివేతలు ఉండాలని చెప్పినప్పటికీ ఎందుకు చేయడం లేదని నిలదీసింది. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు.
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండలం, ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించిన పత్రాలను సమర్పించినప్పటికీ వాటిని పరిశీలించకుండానే తన షెడ్‌ను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ఏ ప్రవీణ్ అనే వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన హైడ్రాను తీవ్రస్థాయిలో మందలించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ప్రవీణ్ 2023 నవంబర్ 15న పంచాయతీ అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టారని చెప్పారు. హైడ్రా తరపు న్యాయవాది ప్రతివాదన చేస్తూ, ముత్తంగి పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అనుమతులను రద్దు చేశారని తెలిపారు.
గతంలో బెదిరించి అనుమతులు తీసుకున్నారని, తర్వాత పంచాయతీ కార్యదర్శి వాటిని రద్దు చేస్తూ తిరిగి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. అన్ని పత్రాలను పరిశీలించాకే హైడ్రా చట్ట నిబంధనలకు లోబడి చర్యలు తీసుకున్నదని అన్నారు. సుప్రీంకోర్టు కూడా రోడ్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని బుల్డోజర్ కేసులో చెప్పిందని గుర్తుచేశారు. ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరమైన ప్రక్రియ ద్వారానే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు, తీవ్రస్థాయిలో హైడ్రాపై అసహనం వ్యక్తంచేసింది. తాము 20కి పైగా ఇలాంటి ఉత్తర్వులు జారీచేశామని, అయినా పిటిషన్లు దాఖలవుతున్నాయని గుర్తు చేసింది.
పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని హైడ్రా ఎలా చెప్తుందని నిలదీసింది. 2023లో పంచాయతీ కార్యదర్శి అనుమతులు మంజూరు చేస్తే 2025లో వాటిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. రెండేండ్లపాటు ఏం చేశారని మండిపడింది. గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. పారు స్థలాన్ని కబ్జా చేశారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామంటున్న హైడ్రా, అదే అసోసియేషన్ హైడ్రా రాకముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. స్థలం హకులను నిర్ధారించే హకు హైడ్రాకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
హకులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అనే విషయం కూడా తెలియకుండా విధులు నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఆస్తిపై హకులను సివిల్ కోర్టులు మాత్రమే తేల్చాలని, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తేల్చవనే విషయాన్ని ఎలా మరిచిపోతారని మండిపడింది. అకడ లేఔట్‌కు అనుమతులను సర్పంచ్ మంజూరు చేశారని, నిజానికి పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వాలనే నిబంధనను గుర్తుచేసింది. పిటిషనర్ అక్రమ నిర్మాణం చేశారని ఎలా నిర్ధరణకు వచ్చారని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను ప్రశ్నించింది. ఆక్రమణదారుడంటే నిర్వచనం ఏమిటో చెప్పాలని నిలదీసిది. పిటిషనర్‌కు చెందిన స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలుచేయాలని ఆదేశించింది. ఇదే తీరును కొనసాగిస్తే హైడ్రా ఏర్పాటు జీవో 99ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.
‘కూల్చివేతలకు తొందర ఎందుకు? ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటి? ఓసారి తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రహరీ కూల్చివేశారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు. ఏ సమాచారం లేకుండా సెలవు రోజున కూల్చివేయడం ఏమిటి? హైకోర్టు ఫుల్‌బెంచ్ ఆర్డర్ ఇచ్చినా ఖాతరు చేయరా?’ అని హైకోర్టు నిలదీసింది. దీనిపై హైడ్రా న్యాయవాది స్పందిస్తూ, ఇకపై సెలవు రోజున కూల్చివేతలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రతిసారి విచారణ సమయంలో మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పడం హైడ్రాకు పరిపాటిగా మారిందని వ్యాఖ్యానించింది. హైడ్రా తప్పులకు ఓ రిజిస్టర్ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా రావొచ్చునని వ్యాఖ్యానించింది.
జగద్గిరిగుట్ట ఫిబ్రవరి 20: హైదరాబాద్ జగద్గిరిగుట్టలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని భూదేవిహిల్స్ , గాజులరామారం డివిజన్లోని మహదేవపురం, కూకట్పల్లి డివిజన్లోని పలుచోట్ల 10 బేస్మెంట్ల్లు, ఒక స్లాబ్ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ ప్రాంతంలో రెండుసార్లు పర్యటించారు. ఈ నేపథ్యంలో గురువారం జగద్గిరిగుట్ట పోలీసులు, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. జగద్గిరిగుట్టలో హైడ్రా తొలగింపులు జరుగుతుండగా తన బేస్మెంట్ కూల్చివేశారని రవి అనే వ్యక్తి జేసీబీ వద్ద ఆందోళనకు దిగాడు.