హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు అంటే కనీసం గౌరవం లేనట్లుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను లెక చేయడం లేదని తప్పుపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే తీరును కొనసాగిస్తే వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట పరిధిలో ఓ ప్రైవేటు స్థల వివాదంపై యథాతథస్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు ఆయనపై కోర్టు ధికరణ కింద చర్య ఎందుకు తీసుకోరాదో చెప్పాలని ఆదేశించింది. ఈ నెల 27న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని గతంలో ఆదేశిస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించింది. రంగనాథ్‌కు కోర్టుపై ఏమాత్రం గౌరవం ఉన్నట్లు లేదని ఆక్షేపించింది. తదుపరి విచారణ జరిగే డిసెంబరు 5న వ్యక్తితంగా హాజరై వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది.
కోర్టు వివాదంలో ఉన్న స్థలం విషయంలో స్టేటస్ కో కొనసాగించాలని జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఏ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ జరిపింది. బాచుపల్లిలో అత్యవసర పనులు ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నట్టు రంగనాథ్ పిటిషన్ దాఖలు చేయడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరిళ్ల వాదిస్తూ, రంగనాథ్ అధికారిక విధుల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు హాజరుకాలేదని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘రంగనాథ్ కోర్టు పట్ల చూపిన దయకు అభినందనలు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కోర్టు తలచుకుంటే ధికరణ చర్యలు ఉంటాయని, ఇదే కోర్టు హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబెట్టిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
కోర్టుకున్న అధికారాలను రంగనాథ్ మరచిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి పరిస్థితులను రంగనాథ్ తెచ్చుకోవద్దని సూచించింది. కమిషనర్ వేసిన కౌంటరులో వరదలు వచ్చాయని పేరొన్నారేగానీ ఎప్పుడు వరదలు వచ్చాయో తేదీలు కూడా ప్రస్తావించలేదని తప్పుపట్టింది. కోర్టుకు ఏం చెప్పినా చెల్లుబాటవుతుందని భావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న మధ్యంతర పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. డిసెంబర్ 5న జరిగే విచారణకు వ్యక్తిగతంగా రంగనాథ్ హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. లేకపోతే నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.