హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాలోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అయితే, ఐఏఎంసీ నిర్వహణకు రూ.3 కోట్ల నిధుల కేటాయింపు జీవోలను సమర్థించింది. ఐఏఎంసీకి భూ కేటాయింపు, నిధుల మంజూరును సవాల్ చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిల్స్‌పై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజనతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఐఏఎంసీకి శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లోని సర్వే నం. 83/1లో 3.74 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో 126ను జారీ చేసింది. ఐఏఎంసీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏటా రూ.3 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన జీవోలు 76, 6, 365 జారీ చేసింది.
ఈ జీవోలను రద్దు చేయాలంటూ న్యాయవాదులు ఏ వెంకట్రామిరెడ్డి, కోటి రఘునాథరావు వ్యక్తిగత హాదాలో పిల్స్ వేశారు. దీనిపై ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. ‘గత నాలుగేండ్లుగా ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదని కేసుల పరిషార లెకలు స్పష్టం చేస్తున్నాయి. గత జనవరి నాటికి 15 ఆర్బిట్రేషన్ కేసులను నిర్వహిస్తే అందులో 11, మీడియేషన్ కేసులు 57కు గాను 17 చొప్పున కొలికి వచ్చాయి. ల్యాండ్ రెవెన్యూ రూల్స్ 1975 నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించి భూకేటాయింపు చేసింది. ఐఏఎంసీ కంపెనీల చట్టం కింద నమోదు కాలేదు. దీనిప్రకారం కూడా భూకేటాయింపు చెల్లదు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు ఉచితంగా బదిలీ చేయడానికి వీల్లేదు. ప్రైవేట్ సంస్థ శాశ్వత ప్రాతిపదికపై ఆర్థిక సాయం పొందడం సబబు కాదు. ఐదేండ్ల తర్వాత ఆర్థిక సాయం కొనసాగించాలో లేదో ప్రభుత్వం ఆలోచన చేయాలి’ అని పేరొంది.