హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోల అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వివరాలు తెలుసుకుని చెప్పాలని శుక్రవారం మౌఖిక ఆదేశాలు వెలువరించింది. తదుపరి విచారణను నవంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేస్తూ ఈ నెల 9న ఎస్ఈసీ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ న్యాయవాది ఆర్ సురేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
తొలుత పిటిషన్‌ను పరిశీలించిన చీఫ్ జస్టిస్.. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపును నిలుపుదల చేసినందున ఈ వ్యాజ్యంలో ప్రత్యేకంగా ఆదేశాలు అవసరంలేదని చెప్పారు. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీలో సుప్రీంకోర్టు, పాత విధానంలో స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లాలని చెప్పినట్టు శుక్రవారం పత్రికల్లో వార్తలు వచ్చాయని అన్నారు. దీనీపై ఎస్ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ఆ తరహా ఉత్తర్వులు ఇవ్వలేదని, మౌఖికంగా సూచన మాత్రమే చేసిందని చెప్పారు. ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వేషన్ల పరిధి 50 శాతం దాటకుండా ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్ల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులుచేర్పులు చేయాల్సి వుందని తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ రాసిందని వివరించారు.
స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు చేయాల్సింది ఎస్ఈసీ కాదని, రాష్ట్ర ప్రభుత్వమని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎస్ఈసీ వేచిచూస్తున్నదని అన్నారు. పిటిషనర్ న్యాయవాది నలిమెల వెంకటయ్య వాదిస్తూ, తాము ఎన్నికల నోటిఫికేషను సవాలు చేయలేదని, ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడాన్ని సవాలు చేశామని వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను సస్పెండ్ చేయడం వల్ల ఎన్నికలు ఆగిపోయాయని చెప్పారు. అదనంగా కేటాయించిన 17 శాతం బీసీ రిజర్వేషన్లు ఓపెన్ క్యాటగిరీకి బదలాయించి ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నది తమ పిటిషన్ ధ్యేయమని చెప్పారు. వాదనల అనంతరం ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.