రాష్ట్ర సర్కార్ జారీచేసే జీవోలన్నింటినీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ఈ ప్రకారం అధికారిక ఉత్తర్వులన్నీ ప్రజలకు తెలిసేలా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఎనిమిది వారాల్లోగా మొత్తం జీవోలను వెబ్సైట్లో పెట్టాలి.
– రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే జీవోలన్నింటినీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో 4 ప్రకారం సర్కారు అధికారిక ఉత్తర్వులన్నీ ప్రజలకు తెలిసేలా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో జీవోలు జారీచేసినప్పటికీ వాటిని అధికారిక వెబ్‌సైట్స్‌లో అప్లోడ్ చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నందా మంగళవారం విచారణ జరిపారు.
అనంతరం కీలక ఉత్తర్వులు జారీచేస్తూ.. 2017 ఏప్రిల్ 10న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో 4 ప్రకారం.. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్స్‌లో తాజా సమాచారం, ఉత్తర్వులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇదే విషయ మై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఇంకా మిగిలిన జీవోలను ఎనిమిది వారాల్లోగా అప్లోడ్ చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వులు అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయకపోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక 19,064 జీవోలు వచ్చాయని, వీటిలో ప్రజలకు అందుబాటులో ఉన్నవి 3,290 మాత్రమేనని వివరించారు. మిగిలిన జీవోలు 15,774 ప్రజలకు అందుబాటులో ఉంచలేదని తెలిపారు.
సమాచారం దాచారు
ఉద్దేశపూర్వకంగా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ కోరారు. సమాచార హకు చట్టం కింద అందిన వివరాల ప్రకారం వ్యవసాయశాఖ నుంచి 1,017 జీవోలు వెలువడితే 116 మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని, ఆర్థికశాఖ 3,720 జీవోలను జారీ చేస్తే 17 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హోంశాఖ 1,470 జీవోలను జారీ చేస్తే ఒక జీవో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచలేదని తెలిపారు. ఆరోగ్యశాఖ 1,043 జీవోలకుగాను ఒకటే అందుబాటులో ఉంచారని చెప్పారు. మంత్రిమండలిలో సభ్యులుకాని మల్లు రవి, జితేందర్రెడ్డ్డి, ఆదిత్యనాథ్‌దాస్, శ్రీనివాసరాజుకు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ జారీచేసిన జీవోలు అధికారిక వెబ్సైట్లో లేవని తెలిపారు.
ప్రజా సంక్షేమానికి సంబంధించిన జీవోలు కూడా అందుబాటులో లేవని చెప్పారు. ఆర్టీఐ చట్టంలోని 4(1) (సీ), 4(1)(డీ) నిబంధనల ప్రకారం ప్రజలకు విధిగా ప్రభుత్వ నిర్ణయాలకు చెందిన ఉత్తర్వులు అందుబాటులో ఉండాలని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాచారం తెలుసుకునే హకును కాలరాస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం 2017లోనే వెలువరించిన జీవో 4 ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలంటూ గతంలో హైకోర్టు వెలువరించిన తీర్పును అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలపై స్పందించిన న్యాయమూర్తి, పిటిషన్ ప్రాథమిక దశలోనే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు.