హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రిజిస్ట్రార్ తదితరులను ఆదేశించింది. సరూర్‌నగర్ మండలం బహదూర్‌గూడ సర్వే నంబర్ 49/13బీలోని 14.31 ఎకరాలు, సరూర్‌నగర్ మండలం సర్వే నంబర్ 9/4లోని 21.09 ఎకరాలు కలిపి మొత్తం 36 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ భూములను సౌత్ ఇండియా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించారు.
ఆ తర్వాత దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిషేధిత జాబితాలో చేర్చారు. 2021, మార్చి 13న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం ఆ భూములను సౌత్ ఇండియా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు జీఆర్ ఇంట్రాకెమ్ లిమిటెడ్, శ్రీ ఇందిరా డిస్టిల్లర్, సిరి సెల్లర్స్, సుదర్శన్ ల్యాబొరేటరీస్‌కు ఇవ్వడంతో వారు ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్, వాసవీ గ్రూప్‌లకు రిజిస్ట్రేషన్ చేశారు.
దీంతో అక్కడ నిబంధనలకు విరుద్ధంగా హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే అధికారం కలెక్టర్‌కు లేదని ఎల్బీనగర్కు చెందిన సామాజిక కార్యకర్త అశోక్ కుమార్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, విచారణను వాయిదా వేసింది.