HYDRAA | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలంటూ నోటీసులిచ్చి, వాటిపై వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించిన హైడ్రా తీరును హైకోర్టు తప్పు పట్టింది. బాధితుల నుంచి వివరణ తీసుకొని, దాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించి, ఆ తరువాత చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ.. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలోని నిర్మాణాలను తొలగించాలంటూ ఈ నెల 10న ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ జకిడి అంజిరెడ్డి సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
హైడ్రా ఇచ్చిన నోటీసులపై వినతిపత్రం సమర్పించడానికి వెళ్తే కార్యాలయంలో ఎవరూ అందుబాటులో లేరని పిటిషనర తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి హైడ్రా నోటీసుకు వివరణ ఇవ్వడానికి ఈనెల 17వ తేదీ వరకు పిటిషనర్‌కు గడువు ఇవ్వాలని, దానిపై 4 వారాల్లో పరిషరించి నిర్ణయం వెలువరించాక చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు.