హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వరద బాధితుల సహాయర్థం ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల ఖర్చు వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. బాధితుల గుర్తింపు అనంతరం తీసుకొన్న సహాయక చర్యలు, వాటి వివరాలను అందజేయాలని, వరదల అనంతరం అంటువ్యాధుల నివారణకు తీసుకొన్న చర్యలు గురించి నివేదించాలని ఆదేశించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇతర ప్రాంతాల్లోని వరదల వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పన ఆర్థికసాయం అందించడంపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ 548 రహదారులు దెబ్బతిన్నాయని వివరిస్తూ నివేదిక అందజేశారు.