హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బార్ కౌన్సిల్ పాలకవర్గం గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీరును హైకోర్టు ఆక్షేపించింది. ఎన్నికల షెడ్యూలును నివేదించాలని గత విచారణలో ఆదేశిస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ఈనెల 25లోగా పూర్తి వివరాలు అందించాలని సూచించింది. పాలకవర్గం గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కే అశోక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని హితవు చెప్పారు. విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.