హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీపై ఎటువంటి చర్యలూ తీసుకోరాదని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పర్యవేక్షణలో లోపాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికలోని సిఫారసుల ఆధారంగా తనపై చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఎస్ కే జోషి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారరణ జరిపింది. గత విచారణ సమయంలో కమిషన్ నివేదిక ఎలా వచ్చిందో చెప్పాలని కోరడంపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ అది ఆన్లైన్లో అందుబాటులో ఉన్నదని చెప్పారు. ఇప్పటికీ ట్విట్టర్లో ఉన్నదని తెలిపారు.
ఒక పత్రికలో నివేదికలోని అంశాలన్నింటినీ అవే పదాలతో ప్రచురించారని చెప్పారు. ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి, మాజీ ఇంజినీర్‌కు కూడా కమిషన్ నివేదిక ప్రతిని పంపారని తెలిపారు. పిటిషనర్‌ను కమిషన్ సాక్షిగానే పిలిచిందని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ఇతరులు ఏమైనా అభియోగాలు చేస్తే వాటిపై వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా అభియోగాలు చేసిందని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరిందని తెలిపారు. సీబీఐ కూడా కమిషన్ నివేదికతో సంబంధం లేకుండా సొంతంగా దర్యాప్తు చేస్తుందని చెప్పారు. వాదనలపై స్పందించిన హైకోర్టు, జస్టిస్ ఘోష్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తు చేయవచ్చునని స్పష్టంచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కేసీఆర్, హరీశ్‌రావుల పిటిషన్లతోపాటు వచ్చే నెల 7న జరుపుతామని ప్రకటించింది.