హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లినప్పుడు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపడితే పోలీసులు ఏకంగా మూడు ఎఫ్ఐఆర్లను నమో దు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఒకసారి తమకు అందిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ అని, మరోసారి రైతుల వాంగ్మూలం మేర కు ఎఫ్ఐఆర్ అని, ఇంకోసారి ఇతర నిందితుల వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్ అని చెప్పి వేర్వేరుగా మూడు ఎఫ్ఐఆర్లను నమో దు చేయడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది. ఒక ఘటనకు చెందిన కేసులో నిందితులుగా ఉన్న వారిని మరో ఎఫ్ఐఆర్ పేరుతో మళ్లీ నిందితులుగా చేరుస్తున్నారని వ్యాఖ్యానించిం ది. ఇప్పటివరకు అసలు ఎంతమంది నుంచి వాంగ్మూలాలు సేకరించారో, వాళ్లు ఏం చె ప్పారో పూర్తి వివరాలు నివేదించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తూ జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గత న వంబర్ 11న లగచర్లలో భూసేకరణ నిమిత్తం అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి వెళ్లినప్పుడు రైతులు వాళ్లపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులు మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. తొలుత ఎఫ్ఐఆర్ 153, ఆ తర్వాత మరో రెండు ఎఫ్ఐఆర్లు (154, 155) నమోదు చేశారు. 153లో నిందితులుగా ఉన్న కొందరు రైతులను 154, 155లోనూ నిందితులుగా పేరొన్నారు. ఇది టీటీ ఆంటోనీ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని, వేర్వేరు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం చెల్లదంటూ రైతులు పవార్ నాయక్ సహా ఐదుగురు హైకోర్టులో సవాలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడాన్ని ఆక్షేపించింది.