హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల 23న సంగారెడ్డి జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జారీ అయిన గెజిట్ నోటిఫికేషన్ 43ను సవాలు చేస్తూ సంగారెడ్డి జిల్లా అందోల్ మండలానికి చెందిన కొరబోయిన ఆగమయ్య బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మహేశ్ వాదనలు వినిపించారు. సంగారెడ్డిలో 613 సర్పంచ్ స్థానాలకు 118 బీసీలకు కేటాయించారని, ఇది 19 శాతమేనని తెలిపారు. నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనకు న్యాయమూర్తి నిరాకరిస్తూ విచారణ వాయిదా వేశారు.
కేసముద్రం/ వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనిపల్లితోపాటు అన్ని జీపీల్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ గండికోట రాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నంలో మూ డు ఎస్టీ కుటుంబాలకు చెందిన ఏడుగు రు మాత్రమే ఓటర్లుండగా, వారికి సర్పంచ్‌తోపాటు మూడు వార్డులు కేటాయించారు. దీంతో రిజర్వేషన్లు మార్చాలని గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 46ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వికారాబాద్‌కు చెందిన మడివాలా మచ్చదేవ, ఎస్ లక్ష్మి, మరో ఆరుగురు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏ ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిజర్వేషన్లు కేటాయించారన్న దానిపై స్పష్టత లేదని వారు ఆరోపించారు. బీసీల్లో కూడా ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గినట్టు పేర్కొన్నారు. ఈ కారణంగా జీవో 46ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గూడూరు, అయోధ్యపురం రెవెన్యూ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రెండు గ్రామాలను షెడ్యూల్ ఏరియాలుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ స్వామి మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ భీమపాక నగేశ్ విచారణ చేపట్టారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవాలు చేయకుండా పిటిషన్ దాఖలు చేయడం చెల్లదని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో బీసీ రిజర్వేషన్లపై 75 ఏండ్ల తర్వాత దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించలేమంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.