హైదరాబాద్, జూన్ 16, (నమస్తే తెలంగాణ): సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విల్లులు, గిఫ్ట్ డీడ్స్ వివాదాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకున్నారని పేర్కొంది. ఇండ్ల స్థలాలు, పొలాలు, అద్దె షాపులు.. వంటి వివాదాలను చట్ట ప్రకారం రెంట్ కంట్రోల్ యాక్ట్ చేయాల్సిన బాధ్యతలన్నీ పోలీసులకు ఇచ్చేలా చట్ట సభలో (అసెంబ్లీ) చట్ట సవరణ చేసేలా చర్యలు తీసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు వివాదంలో కూడా పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసులే సివిల్ వివాదాలను పరిషరించేలా చట్టం తెచ్చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. పిడుగు పడితే రెప్పపాటు కాంతి చిమ్ముతుందని, కానీ అంతకంటే తకువ సమయంలోనే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ నిప్పులు చెరిగింది. తమను నమ్ముకున్న వాళ్లకు తక్షణ సాయం చేసేందుకు తహతహలాడుతున్నారని వ్యాఖ్యానించింది.
ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా?
పోలీసులు చట్ట వ్యతిరేకంగా సివిల్ వివాదాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది. కోర్టులో దాఖలయ్యే సివిల్ వివాదాల్లో 70 శాతం పోలీసుల ప్రమేయం గురించేనని తెలుపుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు హితవు చెప్పినా, అనేకసార్లు హెచ్చరించినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదని మండిపడింది. పోలీసులపై 31 పిటిషన్లు నమోదైతే అందులో 25 కేసులు సివిల్ వివాదాలు హైకోర్టులో ఉన్నాయని చెప్పింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోరాదని ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని ప్రశ్నించింది. మీకు సంబంధం లేని వివాదాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని నిలదీసింది.
హైదరాబాద్ బారస్లోని 256 గజాల ఇంటి స్థలానికి సంబంధించి సివిల్ కోర్టులోని సూట్ ఉపసంహరణకు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ టీ వినోద్‌కుమార్ సోమవారం మరోసారి విచారణ జరిపారు. మోహిసిన్ బఫానా దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ, సివిల్ కోర్టులో దావాను విత్‌డ్రా చేసుకోవాలని చెప్పే అధికారం మీకెవరిచ్చారని పోలీసులను ప్రశ్నించింది. పోలీసుల వ్యవహారశైలి, సివిల్ వివాదాల్లో జోక్యంతో పౌరులు భయపడుతున్నారని వ్యాఖ్యానించింది. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించింది. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం డ్యూటీ చేయాలనే విషయం తెలియదా, ఇదే అంశంపై గతంలోనే తాము ఉత్తర్వులు ఇచ్చిన విషమైనా గుర్తుందా? అని ప్రశ్నించింది. చట్టాలు, నిబంధలనకు తిలోదకాలిచ్చి పోలీసులు కొత్త అవతారాలు ఎత్తుతున్నారని వ్యాఖ్యానించింది.
సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని, పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోబోరని హామీ ఇచ్చారు. పోలీసులకు అందిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైనందున చట్టప్రకారం వ్యవహారం ఉంటుందని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు పోలీసులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతే వచ్చే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని స్పష్టంచేసింది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో పోలీసులు బయటినుంచి స్టేషనరీ తేవాలని కోరినట్టు ఒకరు చెప్పారని తెలిపింది. దర్యాప్తు చేస్తామన్న ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌పై విచారణను మూసివేస్తున్నట్టు ప్రకటించింది.