హైదరాబాద్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ): న్యాయవాదుల రక్షణ కోసం చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. గురువారం హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘న్యాయవాదులపై దాడులు చేయాలనుకునే వాళ్లలో వణుకు పుట్టాలంటే చట్టం ఉండాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి సూచన చేశారు. ఈ సూచనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నది’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకొస్తుందనే నమ్మకం తనకు ఉన్నదన్నారు. క్రిమినల్ కేసుల్లో కోర్టులు జారీ చేసిన సమన్లను నిందితులకు వెంటనే అందజేసేందుకు వీలుగా త్వరలోనే ప్రత్యేక యాప్‌ను తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం రెండు ధర్మాసనాలు పేపర్లు లేకుండానే కోర్టు విధులను నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా హైకోర్టు తీర్పులు ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో ప్రజలకు అందుబాటులో ఉండే వెబ్‌సైట్‌ను జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. ప్రసంగించిన వారిలో అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఉన్నారు. చదువులో ప్రతిభ చూపిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు ఈసారీ అవార్డులను అందజేసిన మాజీ ఉద్యోగి విరూపాక్షరెడ్డిని ప్రధాన న్యాయమూర్తి అభినందించారు.