హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమ లు తీరుపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గతంలో ఇదే అంశంపై దాఖలైన పిల్‌తో కలిపి తాజా వ్యా జ్యాన్ని విచారిస్తామని చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం ప్రకటించింది.
యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (యూఈఈ)ను కట్టుదిట్టంగా అమలు చేసే లా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ న్యా యవాది బీ కొమురయ్య రాసిన లేఖను న్యాయస్థానం పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య గణనీయంగా ఉన్నా డ్రాపౌట్లు చాలా ఎకువగా ఉన్నాయని కొమురయ్య తెలిపారు. 2012, ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఉచిత, తప్పనిసరి విద్య(సవరణ) చట్టం 2012 బాలల హక్కు అని పేర్కొన్నారు. విద్యార్థుల మానసికోల్లాసాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి యోగా తరగతుల నిర్వహణ వంటివి లేవని తెలిపారు. స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కోరారు.