హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ఎంజీ బస్‌స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ వినతి మేరకు మూడు వారాల గడువు మంజూరు చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
ఈలోగా ప్రభుత్వం కౌంటర్‌పై పిటిషనర్ రిప్లయ్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ యాక్ట్ పబ్లిక్ వెల్పేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ రహీంఖాన్ పిల్ దాఖలు చేశారు. దీనిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
మెట్రో విస్తరణతో పరిసర ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, చార్మినార్, ఫలక్‌నుమా, దారుల్షిఫా తదితర కట్టడాలకు ప్రమాదం కలుగుతుందని పిటిషనర్ వాదన. ఈ కట్టడాల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ వ్యవహారంపై పురావస్తుశాఖ, పర్యావరణ రంగాల నిపుణులతో అధ్యయనం కోసం ఒక కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.