హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో, పరిషార మార్గాలతో వారంలోగా నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని ఆదేశించింది. వీధి కుక్కల దాడులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వీధి కుకలు చిన్నారుల మీద దాడి చేసిన ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వ చర్యలు ఆశాజనకంగా లేవని ఆగ్రహం వ్యక్తంచేసింది.
గత విచారణలో ఎంత చెప్పినా ఫలితం అంతంతమాత్రంగానే ఉన్నదని మండిపడింది.కుకలను స్టెరిలైజ్ చేస్తే సరిపోతుం దా? చిన్నారులపై వీరంగం చేయకుండా ఉంటా యా? అని నిలదీసింది. కుకల బారిన పిల్లలు పడకుండా ఉండేందుకు పరిషారమార్గాలతో రావాలని రాష్ట్రానికి తేల్చి చెప్పింది. ఆరు కమిటీలను ఏర్పాటు చేశామంటే సరిపోదని, చర్యలు కూడా ఉండకపోతే ఎలాగని ప్రశ్నించింది. వీధి కుకల దాడిలో పిల్లలు చనిపోయిన ఘటనలకు ఎవరు బాధ్యత వహించాలంటూ నిప్పులు చెరిగింది.
వీధుల్లో చెత్త పేరుకుపోయినప్పుడు వీధి కుకల వీరవిహారం ఎకువవుతుందని, ఈ క్రమంలోనే పిల్లలపై కుకల దాడులు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. వీధుల్లో చెత్త పేరుకపోవడానికి అధికారులదే బాధ్యత అని వ్యాఖ్యానించింది. ఈ సమస్యను పరిషరిస్తేనే కుకల దాడులు తగ్గే అవకాశముందని స్పష్టం చేసింది. వీధికుకల నియంత్రణ సక్రమంగా లేదని, వీధి కుకలకు వ్యాక్సినేషన్ చేయడంలేదని, సరైన ఆహారం లేకపోవడంతో జనంపై దాడి చేసి కరుస్తున్నాయని వనస్థలిపురానికి చెందిన ఎం విక్రమాదిత్య నిరుడు ఫిబ్రవరి 19న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
నగరంలోని బాగ్ అంబర్‌పేట పాఠశాలలో కుకల దాడిలో ఒక విద్యార్థి మరణించినట్టు పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది. గత నెల 20న సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వీధికుకల దాడిలో బీహార్‌కు చెందిన వలస కార్మికుని కుమారుడు మరణించాడు. జవహర్‌నగర్‌లో బుధవారం కుకల దాడిలో ఒక బాలుడు మరణించాడు. వీటిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ టీవినోద్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.