Group-1 | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం కీలకమైన తీర్పు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 2న గ్రూప్-1 పోస్టుల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్ పరీక్షల్లో మూల్యాంకనం. ఫలితాల వెల్లడికి అమలుచేసిన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, రీవాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీకి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పలు జిల్లాలకు నుంచి కే ముత్తయ్య సహా 19 మంది హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం తుది తీర్పును వెలువరించారు.
తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మూల్యాంకనానికి టీజీపీఎస్సీ అనుసరించిన విధానం వల్ల పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. మారుల మెమోకు-వెబ్సైట్ నోట్‌కు వ్యత్యాసం ఉన్నదని చెప్పారు. దీనీపై టీజీపీఎస్సీ తరపు న్యాయవాది సీఎస్ రాజశేఖర్ ప్రతివాదన చేస్తూ, పిటిషన్లకు విచారణార్హత లేదని, తప్పుడు పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేశారని, పిటిషన్లను కొట్టేయాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నాలను అడ్డుకోవాలని, ఈ మేరకు మెమో దాఖలు చేసినట్టు చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు.. పిటిషనర్లు నకిలీ డాక్యుమెంట్లతో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొంది. రాజ్యాంగంలోని 226వ అధికరణం కింద పిటిషనర్లకు ఉపశమనం కల్పించకుండా.. పిటిషన్లను కొట్టివేస్తూ, వారికి రూ.20 వేలు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు న్యాయమూర్తుల కోర్టు మాస్టర్స్ పర్సనల్ సెక్రటరీస్ అసోసియేషన్‌కు చెల్లించాలని ఆదేశించింది.