TG High Court | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య, వీ హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్స్ వేశారు. వేశారు. ఆయా పిటిషన్లను సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లను పెంచుకునేందుకు ప్రభుత్వానికి ఉన్నా 50శాతానికి మించకూడదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
విద్య, ఉద్యోగాల్లో 50శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని.. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదని వాదించారు. 42శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు చూపించలేదని.. బీసీ కుల గణన చేసినా ఇంకా బహిర్గతం చేయలేదన్నారు. ఈ కుల గణన ఆధారంగానే 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెబుతున్నారని.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెబుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు ప్రభుత్వం వద్ద లేవని.. ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 2018లో 34శాతం బీసీ రిజర్వేషన్లు ఇదే కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. చట్టసభలు చేసిన చట్టాలను గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారని.. గవర్నర్లు బిల్లులపై నెలలపాటు ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
బిల్లులను ఆమోదించడం లేదని.. తిప్పిపంపడం లేదన్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. తమిళనాడులో ఒక బిల్లు ఐదేళ్లు గవర్నర్ వద్దే ఉందని గుర్తు చేశారు. ఆర్టికల్ 200ని గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారని.. గవర్నర్లు నిర్ణయం తీసుకోకపోవడంతో వ్యవస్థ స్తంభించిపోతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారని, గవర్నర్ల చర్య వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయన్నారు. సమయంలో బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని.. సమగ్ర అధ్యయనం తర్వాతే బిల్లు చేసి జీవోను తీసుకువచ్చారని సింఘ్వీ వాదించారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబర్ 9పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో వాదనలు సమర్పిస్తామని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. రేపు విచారణ మధ్యాహ్నం 2.15 గంటలకు జరుగనున్నది. అయితే, రేపు స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రానుండగా.. నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలని పిటిషనర్లు కోరగా హైకోర్టు పట్టించుకోలేదు.