హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు నిలదీసింది. గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ ఇచ్చి ఏమైందని ప్రశ్నించింది. గత డిసెంబర్లో జరిగిన విచారణ సమయంలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని అడిగింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ తెలియజేసేందుకు మరో 25 లేదా 30 రోజుల గడువు కావాలని ప్రభుత్వం కోరడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ప్రభుత్వానికి 25 నుంచి 30 రోజుల సమయం ఇచ్చాక.. ఎన్నికల నిర్వహణకు తమకు సుమారు రెండు నెలల వ్యవధి అవసరమని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాల వాదనల అనంతరం తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది.
తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాది జీ భాసర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2024, జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిందని, ఇప్పటికి దాదాపు 18 నెలలు అయ్యిందని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించిందని తెలిపారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తాజా మాజీ సర్పంచ్‌లను పకన పెట్టి గ్రామ పంచాయతీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని అన్నారు. ఇలా చేయడం రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణలను పాలకులు ఉల్లంఘించారని తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం- 2018 నిబంధనలకు ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని చెప్పారు. ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని అన్నారు. విధిగా ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ అధికరణల స్ఫూర్తిని నీరుగార్చిందని అన్నారు. గత విచారణ సమయంలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రెండు నెలల గడువు కోరిన ప్రభుత్వం మళ్లీ గడువు కోరడాన్ని తీవ్రంగా పరిణించాలని అన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు దాటవేత ధోరణిని అవలంబిస్తున్నదని చెప్పారు.
ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకుపోతాయని, వాటిని పరిష్కరించడంలో తీవ్ర అలసత్వం నెలకొంటున్నదని, ఫలితంగా ప్రజలు ఇబ్బందులను ఎదురొంటున్నారని చెప్పారు. దీనికితోడు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు కోత పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు సర్పంచ్‌లు తమ సొంత డబ్బులు వెచ్చించారని తెలిపారు. తీరా నిధుల విడుదల లేకపోవడంతో సర్పంచ్‌లు చేతులు కాల్చుకున్నట్టు అయ్యిందని అన్నారు. తక్షణమే నిధుల్ని విడుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తిచేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకా గడువు కావాలనే యోచనలో ప్రభుత్వం ఉంటే ఎన్నికలు ఎన్విహించే వరకు సర్పంచ్‌లకు పాలనా బాధ్యతలు అప్పగించేలా మధ్యంతర ఆదేశాలు వెలువరించాలని అన్నారు. పంచాయతీలకు ప్రజలెన్నుకున్న పాలకవర్గాలు ఉండి తీరాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోయినప్పటికీ ఎన్నికల సంఘం ఆ దిశగా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
వాదనలపై స్పందించిన హైకోర్టు, ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు జరపకుండా ఏం చేస్తున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది కదా అని తెలిపింది. పోలింగ్ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎన్నికల సంఘం జవాబు చెప్పింది. మాజీ సర్పంచులకు అధికార పగ్గాలు ఇవ్వాలన్న అభ్యర్థనను వ్యతిరేకించిన హైకోర్టు, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ నల్లగొండ జిల్లా మల్లేపల్లి మాజీ సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, జనగాం జిల్లా కంచనపల్లి మాజీ సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ మాజీ సర్పంచ్ అనిల్‌కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నిజాయతీగూడెం మాజీ సర్పంచ్ మురళీధర్ దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలపై జస్టిస్ టీ మాధవీదేవి సోమవారం విచారణ జరిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు సుమా రు నెల గడువు అవసరమని అదనపు ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నదని, సమగ్రంగా ప్రక్రియను పూర్తిచేసేందుకు కొంత వ్యవధి అవసమని అన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ స్పందిస్తూ, ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు తమకు రెండు మాసాల సమయం అవసరమని చెప్పారు. ప్రభుత్వం నుంచి చట్ట ప్రకారం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తే, ఎన్నికల సంఘం వైపు ఏర్పాట్లు చేసేందుకు రెండు నెలల సమయం అవసరమని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.