హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల పదవులకు ఎప్పటిలోగా ఎన్నికలు (Local Body Elections) నిర్వహిస్తారో తెలియజేయాలని హైకోర్టు (High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని తేల్చిచెప్పింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ గత నెల 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC)జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను మంచిర్యాల జిల్లా లక్సెట్టిపల్లి మండలానికి చెందిన ఆర్ సురేందర్ సవాల్ చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
రాజ్యాంగంలోని అధికరణ 243(ఇ) ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తాము మధ్యంతర ఆదేశాలిచ్చినా ఫలితం లేకపోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీసీలకు పెంచిన రిజర్వేషన్లు రద్దయిన విషయంతోపాటు ఎన్నికలు నిర్వహించాలన్న విషయం తెలిసినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదని పేర్కొంది. ప్రభుత్వం కోరినట్టుగా వారం గడువు ఇవ్వడానికి అభ్యంతరంలేదని అయితే ఎన్నికలను ఎప్పుడు నిర్వహించేదీ కచ్చితంగా చెప్పాలని స్పష్టంచేసింది. హైకోర్టు గత ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలపై స్పష్టత ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నదని చెప్పింది. ఈ విషయం తెలిసి కూడా ఎందుకు స్పష్టత ఇవ్వడంలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
అంతకుముందు జరిగిన వాదనల సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకటయ్య తన వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ పాలకవర్గాల గడువు గత ఏడాది జనవరితో ముగిసిందని చెప్పారు. ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్జి, ద్విసభ్య దర్మాసనం ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేసిన తర్వాత వారికి గతంలో బీసీలకున్న 25 శాతం రిజర్వేషన్ల చొప్పున కేటాయింపులు జరిపి జాబితా అందిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
పాలకవర్గాల గడువు ముగిసిన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న జూన్ 25నాటి సింగిల్ జడ్జి ఉత్తర్వుల నేపథ్యంలో నోటిఫికేషన్ జారీచేశామని చెప్పారు. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఈ కోర్టు రద్దు చేసిందని, దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం పంచాయతీలు, వార్డుల కేటాయింపు జరిపి జాబితా ఇవ్వాల్సి ఉన్నదని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, వారం గడువు మంజూరు చేస్తే పూర్తి వివరాలు నివేదిస్తామని అన్నారు.