హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వరదల బీభత్సం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ర్టాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో తీసుకున్న సహాయక చర్యల గురించి సమగ్ర వివరాలు అందజేయాలని గురువారం ఆదేశించింది. విపత్తుల నిర్వహణ చట్టం కింద గతంలో ఇదే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా అమలుచేసిన చర్యలపై నివేదిక అందజేయాలని పేర్కొన్నది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను సెప్టెంబరు 17న చేపడతామని ప్రకటించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం అమలు తీరు లోపభూయిష్టంగా ఉన్నదంటూ గతంలో డాక్టర్ సీహెచ్ సుధాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
ప్రస్తుతం కురుస్తున్న అతి భారీ, కుండపోత వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వరదలు విలయతాండవం చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదంటూ తాజాగా మధ్యంతర పిటిషన్ దాఖలైంది. వరదలు పోటెత్తుతున్నా విపత్తుల నిర్వహణ చట్టం కింద కనీస సహాయక చర్యలు చేపట్టడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చికుడు ప్రభాకర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అతి భారీ వర్షాల ప్రభావం రాష్ట్రంలోని 10 జిల్లాలపై ఉన్నదని, చట్టప్రకారం ముందస్తు చర్యలు తీసుకోలేదదని తెలిపారు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని పేర్కొన్నారు. పంటపొలాలే కాకుండా ఇండ్లు, అపార్ట్మెంట్ల ఫస్ట్ ఫ్లోర్లు కూడా కొన్ని చోట్ల మునిగాయని తెలిపారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, వరద సహాయక చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని తెలిపారు. వరద బాధితులకు షెల్టర్లు, ఆహారం, నీరు, వైద్య సేవలు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కోరారు.
ప్రాజెక్టుల గేట్ల పైనుంచి కూడా వరద నీరు ప్రవహిస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టులు ప్రమాదకరంగా మారాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులు బలహీనపడి తెగితే ఊళ్లకు ఊళ్లు ముంపునకు గురయ్యే దారుణ పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా గిరిజనులకు ముప్పు ఏర్పడే ఆసారం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఇప్పటికే తాము పలు మార్గదర్శకాలను జారీ చేశామని, వాటిని ప్రభుత్వం ఏమేరకు అమలు చేసిందో తెలుసుకున్నాక తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.