హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ (ఈసీ) విధుల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్‌తో అనుసంధానించిన బయోమెట్రిక్‌తోపాటు ఓటీపీ ఆధారిత ఓటర్ ప్రామాణీకరణ వ్యవస్థను అమలు చేయాలని కోరుతూ జూలై 15న ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సయ్యద్ జాకీర్ హుస్సేన్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది. ఓటింగ్ ప్రక్రియలో బయోమెట్రిక్, ఓటీపీ విధానాలను అమలు చేయాలని, ఓటుపై ఫోన్‌కు సందేశం వచ్చేలా చూడాలని ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్ వినతిపత్రంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈసీ చర్యలు తీసుకుంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం పేరొన్నది.