హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): పైవేటు ఇంజినీరింగ్‌తోపాటు ఇతర కాలేజీల్లో సీట్ల పెంపు, కొన్ని కోర్సుల విలీనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని హైకోర్టు స్పష్టంచేసింది. ఇతర కాలేజీల్లో సీట్ల పెంపుదలకు అనుమతించి, తమ కాలేజీలకు అనుమతించకపోవడం వివక్ష కిందకు వస్తుందంటూ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు దాఖ లు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేరొంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది.
ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదం మేరకు సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి ప్రభుత్వం అనుమతించకుండా దరఖాస్తులను తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ఎంజీఆర్, సీఎంఆర్, కేఎంఆర్, మల్లారెడ్డి, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి కాలేజీలు దాఖలు చేసిన అప్పీళ్లపై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది.