High Court | హైదరాబాద్ : సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతున్న తీరుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదని హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు చట్టాల స్ఫూర్తితోనే పోలీసులు పని చేయాలని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు అప్రజాస్వామిక పద్ధతులతో సోషల్ మీడియా యాక్టివిస్టులను అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారింది. ఒక ట్వీట్ చేసినందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు చేసినందుకు కేసులు పెడతామంటే చెల్లదని, కేసులు పెట్టే ప్రతి వ్యక్తి ఏ విధంగా తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగిందో చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంటుందని అప్పుడే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కఠినమైన ఆదేశాలను మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేసిన పోస్టుల వలన మనోభావాలు దెబ్బతిన్నాయి, సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అంటూ అసత్యపు పునాదుల పైన ఆక్రమ కేసులు ఇప్పటిదాకా పెట్టిన ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
హైకోర్టు తన తీర్పులో ఇచ్చిన మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఫిర్యాదుదారుడు స్వయంగా బాధితుడా కాదా అనేది నిర్ధారించుకోవాలి, మూడవ పక్షం చేసే ఫిర్యాదులు పరువు నష్టం కేసులలో చెల్లవు. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. అంతేకాకుండా, కేవలం రాజకీయ విమర్శలు లేదా కఠినమైన వ్యాఖ్యలను నేరంగా పరిగణించకూడదు. హింసను ప్రేరేపిస్తేనే అలాంటి కేసులు నమోదు చేయాలి. పరువు నష్టం అనేది నాన్-కాగ్నిజబుల్ నేరం కాబట్టి, నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, ఫిర్యాదుదారుడు మెజిస్ట్రేట్‌ను సంప్రదించాలని హైకోర్టు సూచించింది. చివరగా, పోలీసులు అరెస్టు చేసేటప్పుడు ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, రాజకీయ ప్రేరేపితమైన లేదా నిరాధారమైన ఫిర్యాదులను తిరస్కరించాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు.. ప్రజాస్వామ్యానికి విజయం, ప్రభుత్వానికి చెంపపెట్టు
బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లను రీట్వీట్ చేసినందుకుగానూ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్, అలియాస్ నల్ల బాలుపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన మూడు కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, ఇది సామాజిక మాధ్యమాల పోస్టులపై అడ్డగోలుగా కేసులు పెట్టే ప్రభుత్వాలకు ‘చెంపపెట్టు లాంటి తీర్పు’ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 21 నెలలుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టి వేధిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
స్వేచ్ఛను అణచివేయడం ఆపాలి.. కేటీఆర్ డిమాండ్
హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కేటీఆర్ తెలంగాణ డీజీపీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌కు ఒక విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులు, సోషల్ మీడియా యోధులపై వేధింపులను తక్షణమే ఆపాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తన కార్యకర్తలకు, కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.