హైదరాబాద్ నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది. చట్ట ప్రకారం విధులు నిర్వహించాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చిచెప్పింది. చట్టప్రకారం చర్యలు ఉండాలనే విషయం ఉన్నతాధికారిగా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి కల్పించుకోవద్దని హైడ్రా కమిషనర్‌ను హెచ్చరించింది. సచివాలయంలోని అధికారులు, వారు అధికారం ఇచ్చిన వ్యక్తులు ప్రజాశాంతి, సామాజిక శాంతి అవసరంలేదని భావిస్తున్నారా లేక వాటిని విస్మరిస్తున్నారా అని ప్రశ్నించింది.
రంగారెడ్డి జిల్లా, ఖానామెట్ గ్రామంలోని తమ్మిడికుంట ట్యాంకు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఇతరుల భూముల్లో యథాతథస్థితి కొనసాగించాలన్న ఉత్తర్వులను ఉల్లంఘించడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారించారు. గత ఆదేశాల మేరకు ఆన్లైన్లో విచారణకు హాజరైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఉద్దేశించి న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. హైడ్రాకు అధికారం ఉంటే అంతకంటే ఉన్నతమైన అధికారం కోర్టుకు ఉన్నదని గుర్తుచేశారు. మీరు అధికారం చెలాయిస్తే కోర్టు అధికారం ఏమిటో రుచి చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారంతో మంచి చేసి ప్రజల మన్ననలు పొందాలని హితవు చెప్పారు. అప్పుడే మీ పనితీరును ప్రజలు ఆమోదిస్తారని అన్నారు. ఏ పని చేసినా అది చట్టబద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. మరోసారి ఇదేవిధంగా కోర్టుకు పిలిపించుకునే పరిస్థితి కల్పించుకోవద్దని, అటువంటి అవకాశం ఇవ్వకుండా విధులు నిర్వహించాలని సూచించారు.
రోజుకు 10 పిటిషన్లు
హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు 10కి తక్కువ కాకుండా వందలకొద్దీ పిటిషన్లు దాఖలవుతున్నాయని, దీనిని బట్టి హైదరాబాద్ జనం ఏ వైఖరితో ఉన్నారో అర్థమవుతున్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆచరణలో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. కోర్టు జారీచేసిన ఆదేశాల ప్రాధాన్యమేమిటో తమకు తెలుసని, వాటిని ఉల్లంఘిస్తే ఎలా స్పందించాలో కూడా కోర్టుకు తెలుసని న్యాయమూర్తి హెచ్చరించారు. చెరువుల పరిరక్షణ చర్యలు చేపట్టడం మంచిదేనని అయితే దానికి ఒక పద్ధతని ఉన్నదని తెలిపారు. చెలాయించడానికి అధికారం ఉండదని, ఉన్న అధికారంతో ప్రజలకు మంచి చేసి మానవతావాదిగా ఉండాలని సూచించారు. ప్రజలు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారని, గ్రామపంచాయతీ అనుమతించిన లేఔట్లలో ప్లాట్లు తెలిసో తెలియకో కొనుగోలు చేసి ఉంటారని అన్నారు.
పెద్ద విస్తీర్ణంలో ఇండ్లు కట్టుకున్న వారిని కాకుండా కేవలం 50 నుంచి వంద గజాలు కొనుగోలు చేసి చిన్నచిన్న షెల్టర్లు వేసుకొని జీవిస్తున్న వారి నివాసాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నట్లుండి ఇలా కూల్చివేస్తే వారి పరిస్థితి ఏమిటని, వారు ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు. ఎన్టీటీఏల్లో కూడా పట్టా భూములుంటాయని చెప్పారు. అన్నింటికీ అధికారమే అంతిమం కాదని, అధికారంతోనే అన్నీ చేయాలనుకుంటే కుదరదని తేల్చిచెప్పారు. ఏదైనా ఒక విధానాన్ని రూపొందించుకొని ముందుకెళ్లాలని సూచించారు. పిటిషనర్ తరపు న్యాయవాది తరుణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏప్రిల్‌లో కోర్టు ఆదేశాలు జారీ చేసినా హైడ్రా పనులు కొనసాగించిందని తెలిపారు. పిటిషనర్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సరస్సు పనులు చేపట్టడంతో భూములు ముంపునకు గురయ్యాయని తెలిపారు. పట్టా భూమా కాదా అని తేల్చడానికి హైడ్రాకు అధికారం లేదని చెప్పారు.
ప్రజారోగ్యం కోసమే: రంగనాథ్
కోర్టు జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశం తమకు లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. కోర్టు స్టే ఉత్తర్వు లు జారీచేసిన వెంటనే పనులను నిలిపివేయాలని తమ సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. తమ్మిడికుంటలో మెడికల్ వ్యర్థా లు అయిదారు అడుగుల మేర వేశారని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని తొలగించామని చెప్పారు. ఆ ప్రదేశం డంపిం గ్ యార్డులా మారుతున్నదని, అక్కడ వంద ల మంది నివాసం ఉంటున్నారని, నీటి కాలు ష్యం ఏర్పడి పిల్లలు, ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని తెలిపారు. తాము కేవ లం డంపింగ్‌ను మాత్రమే తొలగించామని చెప్పారు. హైడ్రాకు ప్రజల మద్దతు ఉన్నదని, రోజూ వందల మంది తమను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పుడో ఇచ్చిన ఎన్టీటీఎల్ నోటిఫికేషన్‌ను పిటిషన ర్లు సవాలు చేయలేదని గుర్తుచేశారు. ప్రభు త్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ హైడ్రా చట్టప్రకారమే చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.