హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ కోసం తనకు కేటాయించిన ‘మైకు’ గుర్తును సవరించాలంటూ అడ్వకేట్ నకా యాదీశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆ గుర్తు కింద గీత ఉండటంతో స్పష్టత లోపించిందని, దాన్ని తొలగించి సవరించిన గుర్తుతో మళ్లీ బ్యాలెట్ పేపరును ముద్రించాలని కోరుతూ ఈ నెల 3న ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టలేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని, ఏమైనా అభ్యంతరాలుంటే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్ స్పష్టం చేస్తూ.. ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
బాబా ఫసియుద్దీన్‌పై చర్యలు: సీఈవో
హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకుంటామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)సుదర్శన్‌రెడ్డి చెప్పారు. పోలింగ్ సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు పలు దఫాలుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, రాంచంద్రనాయక్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఓటర్లను ప్రలోభపెడుతున్న సాక్ష్యాధారాలను ఈ సందర్భంగా సీఈవో సుదర్శన్‌రెడ్డికి అందచేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు ఎగ్జిట్ పోల్స్ ప్రసారంపై నిషేధం విధించాలని కోరారు.