హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): హైడ్రా తీసుకుంటున్న చర్యల్లో వివక్ష ఎందుకు చూపుతున్నదని, పేదలుమధ్య తరగతి ఇండ్ల కూల్చివేతలో చూపుతున్న ఉత్సాహం పెద్దల అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు కనిపించడంలేదని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో కూడా అనుమతి లేకుండా జోక్యం చేసుకొని కంచెలు వేస్తున్న హైడ్రా.. చెరువులను ఆక్రమించి దశాబ్దాలుగా కొనసాగుతున్న నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. జీహెచ్ఎంసీ సహా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. అసలు పరిపాలనా యంత్రాంగం పనిచేస్తున్నదా అంటూ అనుమానం వ్యక్తంచేసింది. సల్కం చెరువు ఆక్రమణలకు గురవుతుంటే, అక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నదని నిప్పులు చెరిగింది. ఇందుకు బాధ్యులైన వారిపై, వారు ఉద్యోగ విరమణ చేసినా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
హైదరాబాద్, చాంద్రాయణగుట్టలోని సల్కం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఒవైసీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ విజయ్‌గోపాల్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. సల్కం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్, సలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంశంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 2014 నుంచి నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు ఎందుకు కండ్లు మూసుకున్నారో జవాబు చెప్పాలని నిలదీసింది. ఈ నిర్మాణాలకు అనుమతులున్నాయా లేదా అన్నది కూడా అధికారులు పరిశీలించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం, పర్యావరణానికి నష్టం జరుగుతున్నా స్పందించకపోవడం ఏమిటని మండిపడింది. ఈ విషయంలో హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేదో స్పష్టత ఇవ్వాలని నిలదీసింది.
అక్రమ నిర్మాణాల తొలగింపులో హైడ్రా వైఖరిలో స్పష్టమైన వివక్ష కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువులు, రహదారులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లకు సంబంధించిన ఆక్రమణలను తప్పనిసరిగా తొలగించాలనే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. ఒవైసీ నిర్మాణాలకు సంబంధించి ప్రారంభం నుంచి ఇప్పటివరకు బాధ్యత వహించిన అన్ని శాఖల అధికారులపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఉద్యోగ విరమణ చేసిన వారినైనా విడిచిపెట్టకుండా బాధ్యులను చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి సూచించింది. ఎంఏయూడీ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో విచారణ జరిపి, ఎవరు తప్పు చేశారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారో సవివరమైన అమలు నివేదికను సమర్పించాలని రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, విద్యాశాఖల ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. సల్కం చెరువు పూర్తి ట్యాంక్ స్థాయి (ఎఫ్టీఎల్), బఫర్జోన్లను నిర్ధారించేందుకు సంయుక్త సర్వే నిర్వహించాలని ఆదేశిస్తూ, ఆ పరిధిలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించి నివేదిక ఇవ్వాలంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వుల గురించి ఆరా తీసింది. ఒవైసీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని, అవసరమైతే వారికి ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థులు మారాలనుకుంటే వారికి పూర్తి సహకారం అందించాలని యాజమాన్యాన్ని కూడా ఆదేశించింది.
హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చెరువు ప్రాంతాన్ని సందర్శించి సమగ్ర నివేదికను సమర్పించాలని లేక్ ప్రొటెక్టర్ కమిటీ చైర్మన్‌ను కోరామని, ఆ నివేదిక అందిన తరువాత ఎఫ్టీఎల్, బఫర్జోన్లను నిర్ధారిస్తామని చెప్పారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సంయుక్త సర్వే నిమిత్తం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులను కేటాయించాలని కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాశామని తెలిపారు. నివేదిక అందగానే లేక్ ప్రొటెక్టర్ కమిటీ చైర్మన్‌కు అందజేస్తామని చెప్పారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. 2005 నుంచి నిర్మాణాలు జరుగుతుండగా ఇప్పుడొచ్చిన హైడ్రా, ఇంతకుపూర్వమే ఉన్న అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో వివక్ష ఎందుకని హైడ్రాను నిలదీశారు. కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల్లోకి వెళ్తున్న హైడ్రా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 2014 నాటి ఈఈ సంతకం చేసిన మ్యాప్‌ను పరిశీలిస్తే.. చెరువులో వివాదాస్పద నిర్మాణాలున్నట్టు తెలుస్తున్నదని అన్నారు.
2012 నాటి శాటిలైట్ మ్యాప్‌ను పరిశీలిస్తే గడ్డిమైదానాలు కనిపిస్తున్నాయని, చెరువు మధ్యలో బీడు భూమి కనిపిస్తున్నదని అన్నారు. 2014లో అక్రమ నిర్మాణాలు మొదలుకాగా.. అవి పూర్తయ్యేలోగా వాటికి అనుమతులున్నాయో లేదో కూడా ఏ అధికారీ పరిశీలించి చర్యలు తీసుకోలేదని తెలుస్తున్నదని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 13న ఈ కోర్టు జారీచేసిన అదేశాలతో అధికారుల్లో కదలిక వచ్చిందని అన్నారు. ఒవైసీ కాలేజీలకు అనుమతులున్నాయో లేదో కూడా ఏ ప్రభుత్వ న్యాయవాది చెప్పడం లేదన్నారు. ఇన్నేండ్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా చర్యలు తీసుకోకుండా తప్పుచేసిన అధికారులను గుర్తించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు.
విద్యార్థులను తరలించడానికి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించబోతుండగా.. ఆ విద్యా సంస్థల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్లు, దాఖలు చేస్తామని, విద్యార్థులకు తామే ఉచితంగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ఉచితంగానే అవకాశం కల్పిస్తాయని, ఎవరైనా విద్యార్థులు బయటికి వెళ్లాలి అనుకుంటే సహకరించాలని ఆదేశించారు. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం కల్పించాలని విద్యాశాఖను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేశారు.