హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): భూమి హక్కులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో బతుకమ్మకుంట స్థలాన్ని యథాతథంగా ఉంచాలన్న ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. తాము ఆదేశించినప్పటికీ దానిని ఖాతరు చేయకుండా ఆదేశాలకు విరుద్ధంగా పునరుద్ధరణ పనులు చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్య కోర్టు ధిక్కరణేనని తేల్చిచెప్పింది. బతుకమ్మకుంట వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు కచ్చితంగా తేటతెల్లం అయ్యిందని పేర్కొంది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పనులు చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు స్పష్టంగా రుజువైందని తెలిపింది. కాబట్టి జరిగిన తప్పును సవరించాల్సిన అవసరం హైడ్రాపై ఉన్నదని తేల్చి చెప్పింది.
హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందు బతుకమ్మకుంట గతంలో ఎలా ఉండేదో తిరిగి ఆ స్థితికి తీసుకురావాలని హైడ్రాను ఆదేశించింది. బతుకమ్మకుంటకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులకు విరుద్ధంగా సుందరీకరణ పనులు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ పీ మధుసూదనరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ పూర్తి చేసి ఇటీవల కీలక తీర్పును వెలువరించింది.
గత ఏడాది జూన్ 12న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కేవలం వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉన్నదని ధర్మాసనం గుర్తుచేసింది. భూమి స్వరూపానికి మార్పులు చేర్పులు చేయరాదని తెలిపింది. ఈ ఆదేశాలకు విరుద్ధంగా పిటిషనర్ హక్కులకు భంగం కలిగించరాదని గత ఆదేశాల్లో స్పష్టంగా ఉన్నదని వివరించింది. అయితే, కోర్టుకు సమర్పించిన ఫొటోల ప్రకారం డ్రైనేజీ పేరుతో ప్రారంభమై పిల్లల ఆటస్థలం, వాకింగ్ ట్రాక్, గార్డెన్, బోర్లు వేయడం వరకు పనులు చేపట్టినట్టు ధర్మాసనం గుర్తించింది. ఇది కోర్టు ఆదేశాలకు విరుద్ధమని తప్పుపట్టింది. బతుకమ్మకుంట పేరుతో గేట్లు ఏర్పాటు చేసి నిర్దిష్ట సమయాల్లో ప్రజలకు ప్రవేశం కల్పించి దాన్ని పార్కుగా మార్చినట్టు తెలుస్తున్నదని వెల్లడించింది.
హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగా, భూమి స్వరూపాన్ని మార్చడం న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని తీవ్రంగా ఆక్షేపించింది. జరిమానా విధింపు లేక శిక్ష కాకుండా జరిగిన తప్పును సవరించాలని తాము నిర్ణయించినట్టు స్పష్టంచేసింది. బతుకమ్మకుంట వద్ద ఉన్న అన్ని బోర్డులు తొలగించాలని హైడ్రాను ఆదేశించింది. ఈ స్థలం హైడ్రా స్వాధీనంలో ఉన్నదనే భావన కలుగకుండా అక్కడి అన్ని ఆనవాళ్లు కనిపించకుండా చేయాలని ఆదేశించింది. అన్ని బోర్డులను, ఇతర గేట్లను తొలగించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో అక్కడ తొలగింపునకు సంబంధించిన వాటిని గుర్తించాలని హైడ్రాను ఆదేశించింది. ఉత్తర్వుల అమలు నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ భూమిలో హైడ్రా తీసుకున్న చర్యలన్నీ కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనేనని తేల్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.
కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వివాదాస్పద భూమిపై నిర్మాణాలు చేపట్టిన హైడ్రాపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు హైడ్రా కమిషనర్‌ను దోషిగా తప్పుపట్టింది. ఈ వివాదస్థలంపై తాము గతంలో ఇచ్చిన స్టేటస్కో ఆర్డర్‌ను హైడ్రా పట్టించుకోలేదని ఆక్షేపించింది. బాగ్ అంబర్‌పేట్‌లోని ఏడు ఎకరాల భూమిపై హక్కుల వివాదం నేపథ్యంలో హైకోర్టు 2025 జూన్ 12న స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేసిన విషయాన్ని గుర్తుచేసింది. అక్కడ వరద నివారణ పనులు మాత్రమే చేపట్టేందుకు అనుమతిచ్చినట్టు తెలిపింది.
ఈ ఆదేశాలను పక్కన పెట్టిన హైడ్రా.. అక్కడ వివాదాస్పద భూమిలో అనేక నిర్మాణాలు చేసిందని తప్పుపట్టింది. 2025 జూన్ నుంచి డిసెంబర్ కాలంలో సదరు భూమి స్వరూపం పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారమని తేల్చింది. టఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని స్పష్టంచేసింది. ఇలాంటి కేసులో జైలుశిక్ష లేదా జరిమానా విధించడం కంటే ముందుగా చేసిన తప్పును సరిదిద్దుతున్నట్టు వివరించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పొందిన ప్రయోజనాల కొనసాగింపు కుదరదని తేల్చి చెప్పింది. అక్కడ ఏర్పాటు చేసిన అన్ని బోర్డులు తొలగించాలని, ఇవన్నీ 4 వారాల్లో అమలుచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
బాగ్ అంబర్‌పేట్‌లో సర్వే నంబర్ 563/1 పరిధిలోని 7 గుంటల భూ వివాదంలో ఏ సుధాకర్‌రెడ్డి హక్కులకు భంగం కలిగించబోమనే హామీకి లోబడి, వరదల నివారణకు పరిమిత పనులు చేపట్టేందుకు హైకోర్టు 2025, జూన్ 12న అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వివాదాస్పద భూమిలో హైడ్రా నిర్మాణ, అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతంగా ప్రారంభించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని చెప్పారు. పలు ఫొటోలు, వీడియోలను కోర్టుకు సమర్పించారు. మురుగునీటి వ్యవస్థలు, బోర్‌వెల్స్, పిల్లల ఆట పరికరాలు, బతుకమ్మకుంట పేరుతో ప్రవేశద్వారం, సూచక బోర్డులు, అధికారిక ప్రారంభోత్సవాన్ని సూచించే ఫలకం వంటివి ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవన్నీ చూస్తే అదంతా హైడ్రా ఆస్తి అనే భావన జనానికి ఏర్పడుతుందని తెలిపారు.