హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమికి సంబంధించి సర్వే నిర్వహించడం వల్ల యాజమాన్య హకులు తేలవని హైకోర్టు స్పష్టంచేసింది. భూమి హద్దులు మాత్రమే తేలుతాయని వెల్లడించింది. సర్వే కేవలం హద్దుల నిర్ణయానికేనని, ఇది హకులను నిర్ధారించడంగానీ, సివిల్ వివాదానికి చెందిన వాళ్లను తొలగించడానికి కాదని తేల్చిచెప్పింది. జీడిమెట్లలో సర్వే నంబర్ 82లో ఉన్న 1.29 ఎకరాల భూమి సర్వేకు అనుమతిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీలుతోపాటు మరో పిటిషన్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. జీడిమెట్లలో 0.33 గుంటల భూమి ఆక్రమణల నేపథ్యంలో ఎస్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన సింగిల్ జడ్జి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఎం రాజశేఖర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి అప్పీలుతోపాటు విడిగా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు.
వక్ఫ్‌బోర్డు భూముల సేకరణపై స్టేటస్ కో ; ఎలివేటెడ్ కారిడార్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం కోసం సికింద్రాబాద్‌లోని వక్ఫ్‌బోర్డుకు చెందిన నాలుగు ఎకరాల భూముల సేకరణపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డుకు చెందిన భూసేకరణపై 2024 డిసెంబర్, 2026 జనవరి 3న ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మహమ్మద్ అబిద్, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సికింద్రాబాద్‌లోని దర్గా సయ్యద్ సాహెబ్, ముస్లిం బోర్డుకు చెందిన శ్మశానంతోపాటు మొత్తం ఎనిమిది ఎకరాల భూమి ఉండగా, అందులో నాలుగు ఎకరాలను ఎన్‌హెచ్ 44లోని ఎలివేటెడ్ కారిడార్ నిమిత్తం సేకరిస్తున్నారని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన భూసేకరణపై వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, వక్ఫ్‌బోర్డు, కంటోన్మెంట్ సీఈవోలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు ఈ భూమికి సంబంధించి స్టేటస్ కో కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.