High Court | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్‌గూడలోని పట్టా భూముల్లో చట్టప్రకారం నిర్మించిన ఇండ్లను హైడ్రా అక్రమంగా కూల్చివేస్తే బాధితులు సంబంధిత అధికారుల నుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పటేల్‌గూడలో సర్వే నంబర్ 6లోని ప్రైవేట్ భూమితోపాటు సర్వే నంబర్ 12లోని ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు తేల్చాలని సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఆ సర్వే పూర్తయ్యే వరకు అక్కడ యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే నంబర్ 12లోని ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఎవరైనా నివసిస్తున్నట్టయితే క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని, ఆ దరఖాస్తులపై అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. పటేల్‌గూడలోని తమ ఇండ్లను హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా కూల్చేస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన 22 పిటిషన్లపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు.
ఆ గ్రామంలోని సర్వే నంబర్ 6లో పట్టా భూములను కొనుగోలు చేశాక ఇండ్ల నిర్మాణాల కోసం పిటిషనర్లు ల్యాండ్ కన్వర్షన్ చేయించుకున్నారని, అన్ని అనుమతులు పొందాకే ఇండ్లను నిర్మించుకున్నారని వారి తరఫు న్యా యవాదులు వివరించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. పిటిషనర్ల ఇండ్లు సర్వే నంబర్ 12లోని ప్రభుత్వ భూమి లో ఉన్నాయని తెలిపారు. ఆ భూమిని మం డల సర్వేయర్ సర్వే చేశాక పిటిషనర్లకు నోటీసులు ఇచ్చామని, ఆ తర్వాతే కూల్చివేతలు చేపట్టామని చెప్పారు. హైకోర్టు స్పందిస్తూ.. తాము కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన సేల్ డీడ్లు ఉన్నాయని, నాలాతోపాటు ఇతర అనుమతులన్నీ పొందాకే ఇండ్లు నిర్మించుకున్నామని పిటిషనర్లు చెప్తున్నారని గుర్తుచేసింది. ఆ రెండు సర్వే నంబర్లలో సర్వే చేసి, హద్దులు నిర్ణయించాలని ఆదేశించింది.