హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): భూములకు సంబంధించిన రికార్డులను తమంతట తాముగా సవరించే అధికారం ఆర్డీవోలకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మెదక్ జిల్లా న్యాలకల్ మండలంలోని 23, 24 సర్వే నంబరల్లో 50 ఎకరాల భూములను తలాబ్ చెరువు భూములుగా పేర్కొంటూ ఆర్డీవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది.
ఆ భూములకు సంబంధించి గతంలోని ఎంట్రీలను రెవెన్యూ రికార్డుల్లో పునరుద్ధరించడంతోపాటు పట్టాదారుల స్వాధీనంలో ఉన్నట్టు ఎంట్రీలను సవరించాలని ఆర్డీవోను ఆదేశించింది. ఆ భూములపై ఏమైనా సందేహాలుంటే తాజాగా జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): మలక్‌పేటలోని వసతి గృహంలో అత్యాచారానికి గురైన అంధ బాలిక వాంగ్మూలాన్ని ఆమె ఇంటి వద్దనే నమోదు చేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. బాధితురాలిన మేజిస్ట్రేట్ వద్దకు పిలిపించడం కంటే ఆమె ఇంటివద్దనే వాంగ్మూలం తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని దర్యాప్తు అధికారికి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేజిస్ట్రేట్‌ను బాలిక ఇంటివద్దకే తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేయించాలని స్పష్టం చేశారు.