దరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా హకును కల్పిస్తూ 2009లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలో ఈ చట్టం ఏ స్థాయిలో అమలవుతున్నదో చెప్పాలని, పూర్తిస్థాయిలో ఎందుకు అమలు చేయలేదో వివరించాలని ఆదేశించింది. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 25% సీట్లను ఉచితంగా కేటాయించాలన్న నిబంధన అమలు చేయడంలేదన్న పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ హాస్టళ్లలో బాత్రూమ్లు, టాయిలెట్లు, పరుపులు, దిండ్లు, అగ్నిమాపక సామగ్రి లేవన్న మరో వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అనంతరం ఈ రెండు పిటిషన్లపై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.