చట్టాలను అమలు చేయకుండా కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా కూల్చివేతలే ఏకైక లక్ష్యంగా దూకుడుగా చర్యలు తీసుకునే వాళ్లను చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు పంపితే పరిస్థితులు తెలిసివస్తాయి. కూల్చివేతలకు ముందు నోటీసులు జారీచేసి ఆక్రమణదారుడి వివరణ కోరాలని తెలియదా? ఉరితీసే ముందు కూడా ఆ వ్యక్తి చివరి కోరిక అడుగుతారు కదా. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? చట్టాలతో పనిలేకుండా కూల్చివేత చర్యలు తీసుకుంటుంటే హైకోర్టులు ఏమీ చేయకుండా కూర్చుని ఉంటాయని అనుకుంటున్నారా? నోటీసులు జారీ చేసినప్పుడు వారి వాదన కూడా వినాలని తెలియదా? శనివారం సాయంత్రం నోటీ సు ఇచ్చి.. ఆదివారం కూల్చివేస్తారా? కోర్టు పనిదినం సోమవారం వరకు ఆగలేకపోతున్నారా?
– హైకోర్టు
High Court | హైదరాబాద్, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కోర్టు ఆదేశాలతో ముడిపడిన భూమిలోని నిర్మాణాలను కూల్చివేసిన తహసీల్దార్, హైడ్రా కమిషనర్లపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అనేక ప్రశ్నలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటన్నరపాటు జరిగిన సుదీర్ఘ విచారణలో ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ హైడ్రా కమిషనర్ ఆవుల రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్ రాధను ఉకిరిబికిరి చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99 అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాల్సివస్తుందని స్వయంగా హైడ్రా కమిషనర్‌ను హెచ్చరించింది. చట్టాలను అమలు చేయకుండా కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా కూల్చివేతలే ఏకైక లక్ష్యంగా దూకుడుగా చర్యలు తీసుకునే వాళ్లను చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు పంపితే పరిస్థితులు తెలిసివస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కూల్చివేతలకు ముందు నోటీసులు జారీచేసి ఆక్రమణదారుడి వివరణ కోరాలని తెలియదా? అని నిప్పులు చెరిగింది. ఉరితీసే ముందు కూడా ఆ వ్యక్తి చివరి కోరిక అడుగుతారని పేర్కొన్నది. ఆదివారం, సెలవు దినాల్లో కూల్చరాదని, సూర్యాస్తమయం తర్వాత కూల్చరాదన్న హైకోర్టు మార్గదర్శకాలు గురించి తెలియదా? అని నిలదీసింది.
హైడ్రా నోడల్ ఏజెన్సీ మాత్రమేనని, అమీన్పూర్లో అక్రమణల తొలగింపునకు మిషన్లు (బుల్డోజర్లు, క్రేన్లు వంటివి), సిబ్బందిని పంపాలని తహసీల్దార్ లేఖ రాస్తే తాము వాటిని సమకూర్చామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ జవాబు చెప్పడంతో కోర్టు మరింత ఆగ్రహం వ్యక్తంచేసింది. అమీన్పూర్లో ఏమి కూల్చివేస్తున్నారో, కూల్చివేత చర్యలకు ఉండే చట్టబద్ధత ఏమిటో, చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చారో లేదో, ఆక్రమణదారులని భావించే వాళ్ల వాదనలు విన్నారో లేదో తెలుసుకోకుండా కోర్టు ఉత్తర్వులు ఏమున్నాయో కూడా చూడకుండా బుల్డోజర్లు, స్టాఫ్‌ను ఎలా పంపుతారని ప్రశ్నించింది. రేపు చార్మినార్, హైకోర్టు కూల్చేయాలని తహసీల్దార్ కోరితే మిషన్లు, సిబ్బందిని పంపుతారా? అని నిలదీసింది. హైకోర్టు భవనాన్ని కూల్చేయడానికి మిషన్లు, స్టాఫ్‌ను ఎలా పంపుతామని రంగనాథ్ జవాబివ్వడంతో హైకోర్టు మళ్లీ ఆగ్రహం వ్యక్తంచేసింది. అమీన్పూర్లో సామాన్యుడికి ఒకలా, హైకోర్టు విషయంలో మరొకలా ఉండడం చట్ట సమానమే అవుతుందా? ఇలా చేయడం వివక్షే అవుతుంది కదా అని చెప్పడంతో రంగనాథ్ మౌనం దాల్చారు. చర్యలు చట్ట ప్రకారం ఉండాలి కదా అని హైకోర్టు ప్రశ్నించడంపై రంగనాథ్ స్పందిస్తూ, కావూరి హిల్స్‌లో కూల్చివేతల గురించి చెప్పబోయారు. ‘మిస్టర్ రంగనాథ్ మీరు జంప్ (దాటవేత) చేయకండి. నేను చాలా నిర్దిష్టంగా అమీన్పూర్ కూల్చివేతల గురించి ప్రశ్నిస్తున్నాను. కావూరి హిల్స్ గురించి కాదు అని చురకలు వేసింది. అమీన్పూర్పై మాత్రమే మాట్లాడాలని, కావూరి హిల్స్ గురించి కాదని తేల్చి చెప్పింది.
బాస్‌ల మాట వింటే జైళ్లకే
కూల్చివేతలకు సమయం ఉంటుంది కానీ కోర్టు ఆర్డర్లు చదివే తీరిక మీకు ఉండదా అని రంగనాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నో ప్రశ్నల తర్వాత దాదాపు విచారణ ముగిసే దశలో తహసీల్దార్ రాధ కల్పించుకుని జిల్లా కలెక్టర్ చెబితేనే చేశామంటూ ఏదో చెప్పబోతుంటే.. చేసిందంతా చేసేశారని, కూల్చాల్సిందంతా కూల్చేశారని, ఇప్పుడు కలెక్టర్ చెప్పారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తే జైళ్లకు పంపాల్సివస్తుందని హెచ్చరించింది. పత్రికల్లో వార్తలు వచ్చాయని తహసీల్దార్ చెప్పగానే మీరు చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తారా? లేక పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించడంతో తహసీల్దార్ మౌనంగా నిలబడిపోయారు. అధికారులు చట్ట ప్రకారం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అడుగులు వేయాలని, ఇష్టానుసారంగానో, ఉన్నతాధికారి చెప్పారనో, పొలిటికల్ బాస్ చెప్పారనో నడుచుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
జవాబులు చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు
హైకోర్టు గత ఆదేశాల మేరకు కమిషనర్ రంగనాథ్ ఆన్లైన్లో హాజరు కాగా, తహసీల్దార్ రాధ వ్యక్తిగతంగా హాజరయ్యారు. సోమవారం జరిగిన విచారణ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ నేరుగా, సూటిగా ఇద్దరికీ ప్రశ్నలు సంధించారు. మధ్యలో తహసీల్దార్ తరఫున న్యాయవాది కల్పించుకునేందుకు ప్రయత్నించగా, నేరుగా అధికారుల వివరణ కోరుతున్నామని, ఆ తర్వాత న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు. అనేక ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితులను ఇద్దరు అధికారులు ఎదురొన్నారు. ఇదే హైకోర్టు విసృ్తత ధర్మాసనం కూల్చివేతల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై వెలువరించిన మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు నిలదీసింది. ఈ తీర్పులను ఈ కేసులోని మధ్యంతర ఉత్తర్వులను చదువుకోవాలని హితవు పలికింది. అమీన్పూర్ భూముల్లో జరిగిన నిర్మాణాలపై వెలువడిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని కూడా ప్రశ్నించింది. ఈ కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న అధికారులు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు వేయకుండా తీర్పులను అమలు చేయకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని తప్పుపట్టింది.
క్రిమినల్ కేసు నమోదు చేయాలి కదా
అమెరికాలో ఉద్యోగం చేసి ఆర్జించిన కష్టార్జితంతో హైదరాబాద్‌లో స్థిరపడాలనే కోరితే విల్లా కొనుకుంటే చెప్పాపెట్టకుండా ఆ విల్లాలను కూల్చేస్తే వాళ్ల జీవితాలు ఏం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వమే స్థలాల రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాక ఆపై రిజిస్ట్రేషన్ చేసిన నాలుగైదేండ్లకు ఆ విల్లానో, ప్లాటునో కూల్చేస్తే ఎలా అని నిలదీసింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే చివరికి సామాన్యుడు నష్టపోతున్నాడని వ్యాఖ్యానించింది. అన్నీ చట్ట ప్రకారం ఉన్నాయనే నమ్మకానికి కారణమైన సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే ప్రశ్నను హైడ్రా కమిషనర్, ప్రభుత్వం ముందుంచింది.
డిజాస్టర్ అంటే కూల్చివేతలే కాదు
డిజాస్టర్ అంటే ఒక కూల్చివేతలే కాదని, ఇంకా చాలా ఉన్నయనే విషయం తెలియదా? ఏదీ లేకుండా కూల్చివేతే పరమావధిగా వ్యవహరిస్తారా? హైడ్రా పరిధి ఓఆర్ఆర్ లోపలే కదా? హైడ్రా పరిధిలో ఎన్ని చెరువులు, కుంటలు ఉన్నయో తెలుసా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నింటికి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌పై తుది నోటిఫికేషన్ ఇచ్చారని ప్రశ్నలతో ఉకిరిబికిరి చేసింది. హైడ్రా తీరు తీవ్ర అందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులు సమర్థించబోవని తేల్చి చెప్పింది. అదే సమయంలో అక్రమ నిర్మాణాలతో పేరుతో హైడ్రా, ఇతర అధికారులు చట్ట వ్యతిరేకంగా కూల్చివేత చర్యలకు పాల్పడితే కూడా సమర్థించే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పింది. అమీన్పూర్ నిర్మాణాలపై స్టేటస్ కో ఆదేశాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్, తహసీల్దార్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. అప్పుడు హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
హైడ్రా జీవో 99పై స్టే ఇవ్వాల్సివస్తుంది..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణనగర్‌లో మహమ్మద్ రఫీ, గణేశ్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన దవాఖాన భవనానికి సెప్టెంబర్ 5వ తేదీన జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి తహసీల్దార్, హైడ్రా కమిషనర్ కూల్చివేత చర్యలు చేపట్టారని తీవ్రంగా తప్పుపట్టింది. కూల్చడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతే హైడ్రా ఏర్పాటు జీవో 99 అమలును నిలిపివేస్తూ స్టే జారీ చేయాల్సివస్తుందని హెచ్చరించింది కోర్టు ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారో చెప్పాలని హైడ్రా కమిషనర్, అమీన్పూర్ తహసీల్దార్‌ను ప్రశ్నించింది.
పిటిషనర్ల వాదనలు
అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలని పేరొంటూ నోటీసులు ఇచ్చాక తమ గోడు వినకుండా ఏకపక్షంగా ఆదివారం కూల్చివేత చర్యలకు పాల్పడ్డారంటూ మధుసూదన్, గణేశ్ కన్స్ట్రక్షన్స్ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫు న్యాయవాది నరేందర్‌రెడ్డి వాదించారు. ఇదే తరహాలో అమీన్పూర్ మండలం పటేల్‌గూడలో 32 విల్లాలకుగాను 26 విల్లాలను కూల్చివేయడాన్ని, మిగిలిన విల్లాల తరఫున కోటేశ్వర్రావు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ల తరఫు ఆర్ చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే నంబర్ 6లో విల్లాలు ఉంటే 12లో ఉన్నాయని, ఇది ప్రభుత్వ భూమి అని పేరొంటూ తహసీల్దార్ కూల్చివేత నోటీసులు ఇచ్చారని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను కూడా లెక చేయలేదన్నారు.
ముందు తేదీతో నోటీసు.. గడువు తీరకుండానే కూల్చివేతలు
అమీన్పూర్ తహసీల్దార్ ఈ నెల 20వ తేదీతో ఉన్న నోటీసులను 21వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు అందజేశారని, 22వ తేదీ ఉదయం ఏడున్నర గంటలకు జేసీబీలు, బుల్డోజర్లు, 50 మంది సిబ్బందితో వచ్చిన హైడ్రా ఐదు అంతస్థుల దవాఖాన భవనాన్ని కూల్చేసిందని నరేందర్‌రెడ్డి చెప్పారు. సర్వే నంబర్ 165, 166లోని మహమ్మద్ రఫీకి చెందిన 270 గజాల స్థలాన్ని గణేశ్ కన్స్ట్రక్షన్స్కు విక్రయించారని, ఆ స్థలంలో నిర్మాణాలకు 2022 నవంబర్ 10వ తేదీన గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నారని వివరించారు. నిర్మాణాలు చేపట్టాక పంచాయతీ జోక్యంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని, ఈ కేసు వాదనల సమయంలో పంచాయతీ నుంచి అనుమతులు ఉన్నందున తాము జోక్యం చేసుకోవడం లేదని పంచాయతీ తరఫు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. దీంతో ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణను మూసేసిందని తెలియజేశారు.
ఇటీవల హైడ్రా కూల్చివేత చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు బెదిరింపుల కారణంగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇదే సమయంలో హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి అప్పుడు ప్రతివాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు చెందిన దవాఖాన ఉన్న ప్రాంతాన్ని హైడ్రా ఎప్పుడూ సందర్శించలేదని, కూల్చివేత చర్యలకు అధికారులకు ఏవిధమైన ఆదేశాలు జారీ చేయలేదని చెప్పారు. ఏ చర్యలైనా జీవో 99 మేరకే ఉంటాయని కూడా హామీ ఇచ్చారని, దీంతో ఆ పిటిషన్‌పై హైకోర్టు సెప్టెంబర్ 5న విచారణను మూసివేసిందని వివరించారు. ఇదిలా ఉంటే గత ఫిబ్రవరిలో పంచాయతీ ఇచ్చిన అనుమతులను రద్దు చేయగా వాటిని హైకోర్టు సస్పెండ్ చేసిందని తెలిపారు. తిరిగి ప్రభుత్వ భూమిలో ఆక్రమ నిర్మాణాలని పేరొంటూ అమీన్పూర్ తహసీల్దార్ ఈ ఏడాది ఏప్రిల్ 2న నోటీసు జారీచేశారని, దీనికి 15 రోజులు గడువు కావాలని పిటిషనర్లు కోరినప్పటికీ అనుమతించలేదని చెప్పారు.
పిటిషనర్లు 18న వివరణ సమర్పించినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని, నిర్మాణాలను తొలగించాలంటూ సెప్టెంబర్ 20వ తేదీతో ఉన్న నోటీసులను 21వ తేదీ సాయంత్రం అందజేశారని, 22న ఉదయం 7.30 గంటలకే కూల్చివేత పనులు చేపట్టారన్నారు. హైడా తరపు న్యాయవాది రవీందర్‌రెడ్డి వాదిస్తూ, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగింపునకు యంత్రాలు, సిబ్బందిని పంపాలని అమీన్పూర్ తహసీల్దార్ నుంచి ఈనెల 21న లేఖ అందిందని, జీవో 99 ప్రకారం, ఆ లేఖ ప్రకారం ప్రభుత్వ స్థలం రక్షణ కోసం యంత్రాలు, సిబ్బందిని పంపినట్టు వివరించారు.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
ఆదివారం ఇంట్లో ఫ్యామిలీతో గడపకుండా కూల్చివేయడానికి ఎందుకు వచ్చారన్న హైకోర్టు ప్రశ్నకు తహసీల్దార్ స్పందిస్తూ నోటీసు ఇచ్చాక బిల్డింగ్ నిర్మాణం ఆపలేదని చెప్పారు. దీంతో కల్పించుకున్న కోర్టు పంచాయతీ ద్వారా లేదా మీరే ఆ బిల్డింగ్‌ను ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించింది. బిల్డింగ్ ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చాక తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఆ తర్వాత కూడా నిర్మాణాలు జరిగేలా ఎందుకు మౌనంగా ఉంటే నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్టు కాదా అని ప్రశ్నించింది. చనిపోయేప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారని, కూల్చివేతలకు ముందుకు పిటిషనర్ వాదనలు వినాలని తెలియదా? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా అని ప్రశ్నించింది.
ఆదివారం కూల్చడం తప్పే: రంగనాథ్
సెప్టెంబర్ 21న శనివారం తహసీల్దార్ అడిగితే 22న ఆదివారం మెన్ అండ్ మిషనరీ ప్రొవైడ్ చేశామని రంగనాథ్ అంగీకరించారు. ఆదివారం కూల్చివేతలు చేపట్టకూడదని ఇదే హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు గురించి తెలియదా? అన్న ప్రశ్నకు.. తెలుసునని, ఆదివారం కూల్చివేతలు చేపట్టడం హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని రంగనాథ్ అంగీకరించారు. ఆదివారం మెన్ అండ్ మిషనరీ ఇచ్చేముందు అమీన్పూర్ తహసీల్దార్‌కు హైకోర్టు ఆర్డర్ గురించి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది కదా అని ప్రశ్నిస్తే రంగనాథ్ మౌనం వహించారు. రెండు రోజలు ఆగకుండా కూల్చివేస్తారా? ఐదు నెలలుగా ఉన్న వివాదంలో ఎందుకు తొందరపడ్డారని ప్రశ్నించింది.
జనాన్ని టెర్రరైజ్ చేస్తారా?
చెరువులు, కుంటల వద్ద స్థలాలు, ఆస్తులు కొనాలంటే జనం భయపడాలంటూ మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో ఒక న్యాయవాది తన దృష్టికి తెచ్చారని, మీరు ప్రజలను టెర్రరైజ్ చేస్తున్నారా? లేక చట్టాన్ని అమలు చేస్తున్నారా? అసలు మీ ఉద్దేశం ఏమిటని రంగనాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. తాను ఆవిధంగా చెప్పలేదని రంగనాథ్ బదులిచ్చారు. దీంతో ఆ ఇంటర్వ్యూను ఇంగ్లిషులో తర్జమా చేసి నివేదించాలని న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ‘ఆర్టికల్ 21 గురించి చెప్పారని, రిజిస్టర్ సేల్‌డీడ్, పర్మిషన్ ఉన్న నిర్మాణం, విద్యుత్తు, వాటర్ వంటి కనెక్షన్లు ఉన్నప్పుడు ఆ నిర్మాణాన్ని ఆదివారం కూల్చేస్తారా? ఇదేనా ఆర్టికల్ 21 అమలని నిలదీసింది. బోనఫైడ్ పర్చేజర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, అమెరికా నుంచి వచ్చి ఇకడ ఆస్తి కొంటే కూల్చేస్తారా? హైడ్రాతో ఏమాత్రం సంతోషంగా లేం. ఇలాగే విధులు కొనసాగిస్తే రేపు జీవో 99ని సవాల్ చేసిన పిటిషన్లు రెండు విచారణకు రానున్నాయి. జీవో 99 (హైడ్రా ఏర్పాటు) అమలుపై స్టే ఇవ్వాల్సివస్తుంది’ అని హైకోర్టు హెచ్చరించింది.
హైడ్రా విధానం ఎకడుంది?
హైడ్రా అంటే కూల్చివేతలేనా? ట్రాఫిక్ కోఆర్డినేషన్ ఇతర విధులు కూడా హైడ్రాకు ఉంటే కూల్చివేతలు తప్ప మరో పనిచేయలేదు అని హైకోర్టు తప్పుపట్టింది. ట్రాఫిక్ అంశంపై సమీక్ష చేశామని రంగనాథ్ చెప్పడంపై ఆ విధానం ఎకడుందో చెప్పాలని అడిగింది. హైడ్రాకు విధానం లేదని, ఎడాపెడా కూల్చివేతలే లక్ష్యంగా పనిచేస్తున్నదని మండిపడింది. ఇదేనా ప్రజల కోసం పనిచేయడమని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే లక్ష్యమని రంగనాథ్ చెప్పడాన్ని సమర్థిస్తున్నామని, అయితే, ఆదివారాలు కూల్చివేయడం, చట్ట వ్యతిరేకంగా చేయడం, విధానం లేకుండా చర్యలు చేపట్టడం ఆక్షేపణీయమని తప్పుపట్టింది. అమీన్పూర్లో వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. 250 చెరువులు ఉండేవని తెలిపారు. 138 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ ఫైనల్ నోటిఫికేషన్ వెలువడ్డాయని చెప్పారు. ఎఫ్‌టీఎల్‌పై తుది నోటిఫికేషన్ వెలువరించాలని అనేకసార్లు ఆదేశించినా ఫలితం లేకపోయిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దుర్గం చెరువు విషయంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు అయ్యాక నోటీసులు ఇచ్చారని, మూసీ విషయంలో 20 లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపింది. జీవో 99 అమలు చేయాలని చెప్పింది. ఒక శాఖ అనుమతిస్తే మరో శాఖ కూల్చేస్తే ఎలాగని, సింగిల్ విండో ఎకడుందని ప్రశ్నించింది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోవద్దని సుతిమెత్తంగా హెచ్చరించింది.
తొలుత ప్రభుత్వ ఆక్రమణలు కూల్చండి
పిటిషనర్లు 2021లో స్థలాలను కొనుగోలు చేస్తే ఆ భూములపై ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ లో సర్వే చేసిందని, సర్వే చేసేముందు పిటిషనర్లకు ఎందుకు నోటీసు ఇవ్వలేదని తహసీల్దార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్ నుంచి 5 నెలలు అగిన అధికారులు 48 గంటల నోటీసు ఇచ్చి 40 గంటలకే కూల్చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. గతంలో చెరువుల ఎఫ్టీఎల్ గుర్తింపునకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలంటే చేయలేదని తెలిపింది. పేట్‌బషీరాబాద్ ప్రభుత్వ స్థలంలో పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఉన్నాయని, ఇలాంటి వాటిని కూల్చాక సామాన్యులవి కూల్చితే బాగుంటుందని సూచింది. బతుకమ్మకుంట, నల్లకుంట, ఇబ్రహీంపట్నం చెరువుల పరిస్థితి ఏమయ్యాయో బాహాటంగా కనబడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది.
హైడ్రా చర్యలు ఏమాత్రం సంతృప్తిగా లేవు
మూసీ సర్వే ఇతర అంశాలు తమకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిపై తిరిగి కల్పించుకున్న హైకోర్టు.. హైడ్రా చేస్తున్న పనుల పట్ల హైకోర్టు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని తేల్చి చెప్పింది. నిర్మాణాలను కూల్చడానికి మీకు ఉన్న అర్హత తెలపాలని కోరింది. కేవలం మీరు కూల్చివేతల పైన దృష్టి పెట్టారని, కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న విధానం ఏమిటో చెప్పాలని కోరింది. అక్రమ కట్టడాల తొలగింపు చర్యలు సమర్థనీయమేనని, అయితే, ఆ చర్యలు చట్టాలకు లోబడి ఉండకపోతే ఎలా అని ప్రశ్నించింది. కూల్చివేతల చర్యలు ప్రభుత్వ కార్యాలయాలకు కోర్టులకు సెలవులు, వారాంతపు సెలవులో తీసుకోవడం హైకోర్టు తీర్పుకు విరుద్ధం అవుతుందని, కోర్టు ధికారం అవుతుందని కూడా హెచ్చరించింది. కలెక్టర్ చెబితేనే కూల్చివేత చర్యలు తీసుకున్నామన్న తహసీల్దార్ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. ఆదివారం కూల్చివేతలు సరైనవి కావని, ఆ రోజు కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చదువు కోవాలని నొకి చెప్పింది.
రాత్రికి రాత్రి సిటీని మార్చలేరు
కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారమే చర్యలు చేపట్టాలని హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించాల్సిందేనని, రాత్రికి రాత్రి సిటీని మార్చేద్దామని అనుకుంటే వీలుకాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నొకి చెప్పింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలను పరిశీలిస్తే కూల్చివేత చర్యల నిబంధనను మాత్రమే అమలు చేస్తున్నదని, ఇతర అంశాలను గాలికి వదిలేసిందని తప్పుపట్టింది. మూసీపై మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని ఆరా తీసింది. హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఉన్నతంగానే ఉన్నదని, కూల్చివేత చర్యలను ఏనాడూ కోర్టులు ఆపలేదని గుర్తు చేసింది.
హైడ్రా ఏర్పాటు జీవో 99 అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాల్సివస్తుంది. చట్టాలను అమలు చేయకుండా కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా కూల్చివేతలే ఏకైక లక్ష్యంగా దూకుడుగా చర్యలు తీసుకునే వాళ్లను చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు పంపితే పరిస్థితులు తెలిసివస్తాయి. కూల్చివేతలకు ముందు నోటీసులు జారీచేసి ఆక్రమణదారుడి వివరణ కోరాలని తెలియదా? ఉరితీసే ముందు కూడా ఆ వ్యక్తి చివరి కోరిక అడుగుతారు కదా.
– హైకోర్టు
అమెరికాలో ఉద్యోగం చేసి ఆర్జించిన కష్టార్జితంతో హైదరాబాద్‌లో స్థిరపడాలనే కోరితే విల్లా కొనుకుంటే చెప్పాపెట్టకుండా ఆ విల్లాలను కూల్చేస్తే వాళ్ల జీవితాలు ఏం కావాలి? ప్రభుత్వమే స్థలాల రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాక ఆపై రిజిస్ట్రేషన్ చేసిన నాలుగైదేండ్లకు ఆ విల్లానో, ప్లాటునో కూల్చేస్తే వారి పరిస్థితి ఏంటి?
-హైకోర్టు
అధికారులు చట్ట ప్రకారం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అడుగులు వేయాలి. మీ ఉన్నతాధికారి,పొలిటికల్ బాస్‌లు చెప్పినట్టు నడుచుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హైడ్రా జీవోలోని ఇతర అంశాలన్నింటినీ వదిలేసి కూల్చివేతలకు మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు.-హైకోర్టు
రేపు చార్మినార్, హైకోర్టు భవనాలను కూల్చేయాలని తహసీల్దార్ అడిగితే మిషన్లు, సిబ్బందిని పంపుతారా? అమీన్పూర్లో సామాన్యుడికి ఒకలా, హైకోర్టు విషయంలో మరొకలా ఉండటం చట్ట సమానమే అవుతుందా? ఇలా చేయడం వివక్షే అవుతుంది కదా.
– హైకోర్టు
పిటిషనర్‌కు 48 గంటల గడువు ఇచ్చి 40 గంటల్లోనే అది కూడా అదివారం సెలవు రోజున ఉదయం ఏడున్నర గంటలకే ఎందుకు కూల్చాల్సి వచ్చింది. హైకోర్టు సెలవుల్లో, సూర్యాస్తమయం అయ్యాక కూల్చివేత చర్యలు తీసుకోరాదన్న ఉత్వర్వులకు విరుద్ధంగా ఎందుకు కూల్చారు? -హైకోర్టు