Rythu Bharosa | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రైతులకు రైతుభరోసా అమలు చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే, అందరికీ వచ్చిందా? రాలేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఏర్పాటుచేసిన ధన్యవాద సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘రైతు రుణమాఫీ చేసినం, రైతుభరోసా అమలు చేసినం. అందరికీ వచ్చిందా? రాలేదా? అంటే నాకు తెలియదు.. మీరిచ్చిన సమాచారమే నా వద్ద ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి, యాసంగికి ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. అయినప్పటికీ, లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న రైతుభరోసా నిధులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ వచ్చిందో రాలేదో తనకు తెలియదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
కొత్వాల్‌గూడ వద్ద ఎకో హిల్‌పార్క్ ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులు, యువతను అవమానించేలా, కించపరిచేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మూసీ నది ఒడ్డుకు ఇరువైపులా కూరగాయల షాపులు, హోటళ్లు, వంటల దుకాణాలు, ట్యాక్సీలు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మూసీ అభివృద్ధికి సంబంధించి అంశాలపై మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మూసీ నది రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసుకొని.. బ్రహ్మాండంగా లైట్లు పెట్టి… రాత్రి పూట నది ఒడ్డున రెండువైపులా హోటళ్లు, కూరగాయల దుకాణాలు, వంటలు, ట్యాక్సీల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పగటి పూటే కాదు.. రాత్రి పూట కూడా ఆదాయం వచ్చేలా నైట్ టూరిజం డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలతో తమను అవమానించారని నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. అధికారంలోకి వస్తే తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఇప్పుడేమో కూరగాయల షాపులు, హోటళ్లతో ఉపాధి కల్పిస్తామని చెప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ చేసిన మోసానికి, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అవమానానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి బీద అరుపులు అరిచారు. అప్పుల రాగం ఎత్తుకున్నారు. ఒకవైపు రూ.లక్ష కోట్లతో మూసీ అభివృద్ధి చేస్తామని, రూ. 5వేల కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్తూనే మరోవైపు, ఖజానా ఖాళీగా ఉన్నదంటూ బీద అరుపులు అరవడం గమనార్హం. సర్కార్ ఖజానా ఖాళీగా ఉన్నదని, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేమని చేతులెత్తేశారు. ప్రభుత్వం వద్ద ఆర్థిక సమస్యలు ఉన్నాయని, రిటైర్డ్ ఉద్యోగులకు బెన్ఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉన్నదని చెప్పారు. ప్రతి నెలా వెయ్యి మంది రిటైర్ అవుతున్నారని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఒక్కొక్కరికి దాదాపు రూ.కోటి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ఇలా నెలకు వెయ్యి మంది రిటైర్ అయితే రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సిన ఆర్థిక భారం ప్రభుత్వంపై ఉన్నదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము దాచుకున్న డబ్బులు తమకు ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నిస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వడానికి ఖజానా ఖాళీగా ఉన్నదని చెప్తున్నప్పుడు, మూసీ నది వద్ద రూ. 5వేల కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటుకు డబ్బులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఓటు వేయలేదనే కోపమో ఏమోగానీ అపార్ట్మెంట్ వాసులపై సీఎం రేవంత్అసహనం వ్యక్తంచేశారు. అపార్ట్మెంట్ వాళ్లు ఓట్లు వేస్తే తాము గెలువలేదని చెప్పారు. ‘రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే బస్తీవాళ్లు వేసిన ఓట్లతోనే గెలిచారు. అంతేకాని, పెద్దపెద్ద అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్లు ఓటేస్తే గెలువలేదు’ అని వ్యాఖ్యానించారు. అయితే సీఎం రేవంత్ఈ వ్యాఖ్యలు మధుపార్క్ అపార్ట్మెంట్ వా సులను ఉద్దేశించి చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ నది వద్ద రూ. 5వేల కోట్లతో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం స్థలాన్ని సేకరిస్తున్నది. అక్కడే ఉన్న అతిపెద్ద మధుపార్క్ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయాలని నిర్ణయించింది. దీంతో అపార్ట్మెంట్ వాసులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో వారిపై అసహనంతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరోక్షంగా ఆపార్ట్మెంట్ వాసులతో తమకు అవసరం లేదని తేల్చి చెప్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రభుత్వం వద్ద పేదలకు పంచడానికి భూములు లేవని, ప్రభుత్వం వద్ద ఆర్థిక వెసులుబాటు పరిమితమైందని ప్రకటించారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం స్పందిస్తూ.. ‘దయచేసి మా అసైన్డ్ భూముల జోలికి రాకుండా మీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వండి. వాటికి పట్టాలివ్వండి’ అని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.