ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రాను నిలదీసింది. పేదల నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టకుండా పెద్దల నిర్మాణాలను తాకి చూడాలని వ్యాఖ్యానించింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? సంపన్నులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ.. చట్టం అందరికీ సమానమేనని గుర్తుంచుకోవాలని హైడ్రాకు స్పష్టం చేసింది.
High Court |హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ) : మురికివాడల్లోని పేదల నిర్మాణాలను కూల్చేసి పేపర్లలో ఫొటోలు అచ్చు వేయించుకోవడం కాదని, దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల అక్రమ నిర్మాణాలను తొలగించినప్పుడే నీటివనరులను రక్షించి ప్రజాప్రయోజనాలను కాపాడినట్టు అని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మీరాలం చెరువు వద్ద ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలుంటే తొలగింపునకు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని 329/1, 320/2, 329/3 సర్వే నంబర్లలో 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి తాసిల్దార్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ సామ్స్ ఫాతిమాఖాన్, మరొకరు హైకోర్టును 12వ పేజీలో ఆశ్రయించడంతో జస్టిస్ సీవీ భాసర్రెడ్డి బుధవారం విచారణ జరిపారు. వక్ఫ్ బోర్డు సీఈవో లేఖ ఆధారంగా తాసిల్దార్ వాల్టా చట్టం కింద నోటీసులు ఇవ్వడం చెల్లదని, ఆ అధికారం తాసిల్దార్కు లేదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఆ స్థలం వక్ఫ్ బోర్డుది అయితే సీఈవో చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. మీరాలం ట్యాంకు ఆక్రమణలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ‘సరస్సుల నగరం’ (హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్)గా పేరుగాంచిన హైదరాబాద్లో మొత్తం 2,200 చెరువులకుగాను ప్రస్తుతం 180 మాత్రమే ఉన్నాయని తెలిపింది. రెవెన్యూ చట్టంతో చెరువులను కాపాడటం కష్టమని నిజాం నవాబు భావించి ఆనాడే ప్రత్యేక చట్టాన్ని తెచ్చారని గుర్తుచేసింది. మీరాలం చెరువు వద్ద ఉన్న వివాదాస్పద భూమిపై సర్వే చేయాలని, అది ప్రభుత్వ భూమి అని తేలితే రెవెన్యూ చట్టం కింద చర్యలు తీసుకోవాలని, వక్ఫ్ బోర్డుదని తేలితే ఆ బోర్డుకు వదిలేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ.. పిటిషన్పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.