హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రభుత్వంలో ‘బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్ వసూళ్ల లొల్లి’ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నదా? ఈ ప్రభా వం ఫండింగ్పై పడుతుందని ఆందోళన చెందుతున్నదా? చిల్లర గొడవలతో పార్టీకి తెలంగాణ నేతలు నష్టం చేస్తున్నారని భావిస్తున్నదా? పార్టీని సాకాల్సిన తెలంగాణలో తాజాగా నెలకొన్న ఈ పరిస్థితులు హై కమాండ్‌కు ఆందోళన కలిగిస్తున్నయా? అంటే ఈ ప్రశ్నలకు వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానాలే వినిపిస్తున్నా యి. బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఈ నెల 7న సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ఎ దుట కాంట్రాక్టర్లు ధర్నాచేశారు. తమకు బిల్లులు చెల్లించడం లేదని, అడిగితే 20 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని బహిరంగంగానే చెప్పా రు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం కమీషన్లు వసూలు చేస్తున్నదనే ఆరోపణలు, ఇది కమీషన్ల సర్కారు అనే విమర్శలు వెల్లువెత్తాయి.
అధిష్ఠానం ఉలికిపాటు?
తెలంగాణ సచివాలయంలో జరిగిన ‘20 శాతం కమీషన్ల లొల్లి’తో ఢిల్లీలోని అధిష్ఠానం ఉలిక్కిపడ్డట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. 20 శాతం కమీషన్ ఆరోపణలతో తెలంగాణ నుంచి ఢిల్లీకి అందే ఫండింగ్‌లో కోత పడుతుందేమోననే ఆందోళనలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వాస్తవానికి దేశంలో పార్టీ మూడు రా ష్ర్టాల్లోనే అధికారంలో ఉన్న ది. ఇందులో హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎలాంటి సహకారం అందే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఇప్పటికే రచ్చరచ్చ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మొత్తం తెలంగాణపైనే ఆశలు పెట్టుకున్నదనే వాదనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వంపై ఆరోపణలు రావడంపై అధిష్ఠానం ఆందోళన చెం దుతున్నట్టు తెలిసింది. ఈ ఆరోపణలు ఇలానే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదనే భావనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే పార్టీకి తెలంగాణ నుంచి వచ్చే ‘ఆక్సిజన్’ ఆగిపోతుందని, పార్టీని నడిపడం ఎలాగన్న ఆందోళనలో అధిష్ఠానం పెద్దలు ఉన్నట్టుగా ఢిల్లీ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అప్రతిష్ట సంగతి పక్కన పెడితే వనరుల సమీకరణ ఎలాగన్న టెన్షన్లో ఉన్నట్టు చర్చ నడుస్తున్నది.
గుట్టుగా చేయాల్సిన దాన్ని కంపు చేస్తరా?
బిల్లుల చెల్లింపుల్లో శాఖకో రేటు, పనికో రేటు ఫిక్స్ చేసినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. కమీషన్ లేనిదే పైసా పని కావడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా నేరుగా కాంట్రాక్టర్లే సచివాలయం సాక్షిగా ధర్నా చేయడం, 20 శాతం కమీషన్ డిమాండ్ ఆరోపణలు చేయడం పార్టీలో తీవ్ర రచ్చకు దారితీసింది. ఈ విషయంలో రాష్ట్ర నేతలపై అధిష్ఠానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని పలువురు కీలక నేతలకు ఫోన్లలోనే వా యింపులు నడిచినట్టు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. ‘గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సిన పనిని కంపు కంపు చేస్తారా?.. మీ చిల్లర గొడవలతో రచ్చరచ్చ చేస్తున్నరు.. మీకెవరికీ పార్టీ ప్రయోజనాలు పట్టవా?’ అంటూ తీవ్రంగా అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వచ్చే మూ డేండ్లు పార్టీని ఆదుకుంటుందనుకున్న తెలంగాణలో ఈ విధంగా రచ్చ చేస్తే ఎలాగని ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ మొత్తం తెలంగాణ, హైదరాబాద్‌పైనే ఆశలు పెట్టుకున్నదని, ఇలాంటి సమయంలో బహిరంగంగా.. అదీ విచ్చలవిడిగా వసూళ్లు చేయడం ఏమిటని నిలదీసినట్టు తెలిసింది. ఈ రచ్చ కారణంగా పార్టీకి వనరుల సమీకరణపై పడే ప్రభావాన్ని ఎవరు భర్తీ చేస్తారంటూ నిలదీసినట్టు సమాచారం. గొడవల కారణంగా పార్టీకి వనరులు సమకూర్చేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చర్చనడుస్తున్నది.
కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ బద్నాం
గతంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 30%, 40 % కమీషన్లతో బద్నామైన విషయాన్ని అధిష్ఠానం పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుర్తు చేసినట్టు తెలిసింది. ఇప్పుడు కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ బద్నామైతున్నామని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
కాంట్రాక్టర్ల వెనుక ఉన్నదెవరు?
ఇటీవల జరిగిన కాంట్రాక్టర్ల కమీషన్ల ఆరోపణలు, ధర్నా వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఉన్నట్టుగా పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. ముఖ్యనేతకు సంబంధించిన వ్యక్తులు కాంట్రాక్టర్ల వెనక ఉండి వారిని ఎగదోశారనే చర్చ పార్టీలో, సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. లేనిపక్షంలో కాంట్రాక్టర్లు ఒకేసారి గుంపుగా వచ్చి అది కూడా సచివాలయంలో డిప్యూటీ సీఎం చాంబర్ ఎదుట ధర్నాకు దిగడం మామూలు విషయం కాదనే చర్చ నడుస్తున్నది. వీరి వెనుకాల కీలక నేతలు లేకుంటే వాళ్లు అంత ధైర్యం చేయబోరనే చర్చ కూడా జరుగుతున్నది. ఈ కమీషన్ల వ్యవహారంపై కొద్ది రోజులుగా పార్టీలోని ముగ్గురు కీలక నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.